* కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్
* ఎన్ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజిమెంట్ డైరెక్టర్
* స్వయం ప్రతిపత్తి విభాగంగా ఉన్నతీకరించే అవకాశం
* జీహెచ్ఎంసీ పరిధి కాదు.. ఇక హెచ్ ఎండీఏ పరిధి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఐజీ రంగనాథ్‌కు కీలక పోస్టింగ్ దక్కింది. ఎస్పీ, డీఐజీ స్థాయి అధికారులు మాత్రమే ఇప్పటి వరకు ఎన్ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజిమెంట్ విభాగానికి డైరెక్టర్ గా ఉన్నారు. ఐజీపీ హోదాలో ఉన్న ఏవీ రంగనాథ్‌ను ఈ విభాగానికి డైరెక్టర్‌గా నియమించడంతో చర్చనీయాంశమైంది. ఐజీ హోదా ఉన్నఅధికారిని స్థాయి తగ్గించి డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. ఒక విదంగా పనిష్మెంట్ పోస్టింగ్ అన్న చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజిమెంట్ విభాగాన్ని మరింత ఉన్నతీకరించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈవీడీఎం డైరెక్టర్‌గా రంగనాథ్‌ను బదిలిచేశారని సమాచారం .
* ఇక స్వయం ప్రతిపత్తి
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్ నియంత్రణలో ఉండే విదంగా 2018 మే 13న ఎన్ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజిమెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. జీహెచ్ ఎంసీ కమిషనర్ పరిధి కాకుండా ఇపుడు హెచ్ఎం డీఏ పరిధి వరకు విస్తరిస్తున్నారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో మరో ఇద్దరు ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికార్లను కూడా ఈ విభాగంలో నియమిస్తారు. అంతే కాకుండా రెవిన్యూ అధికారులతో పాటు ఇతర అనుబంధ శాఖల అధికారులను కూడా నియమిస్తారని తెలిసింది. మౌళిక వసతులతో పాటు సిబ్బందిని కూడా ఎక్కువ సంఖ్యలో కెటాయించే అవకాశం ఉందని సమాచారం. జీహెచ్ ఎంసీ , హెచ్ ఎండీఏ ఉన్నతాధికారుల నియంత్రణలో కాకుండా స్వయం ప్రతిపత్తితో పనిచేసే సంస్థగా తీర్చి దిద్దే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.
* కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
అక్రమ నిర్మాణాలకు అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. నాలాలు, చెరువులు, రోడ్లు , ప్రభుత్వ స్థలాలు కావేవి కబ్జా కనర్హం అన్నట్టు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ అధికారుల అవినీతి వల్ల ఈ నిర్మాణాలు యదేచ్ఛగా చేపట్టారు. వేలాది చెరువులు, కుంటలు రియల్ ఎస్టేట్ గా మారిపోయాయి. కాల క్రమంలో అవే కాలనీలుగా మారడంతో చిన్నపాటి వర్షాలకే ముంపు ప్రాంతాలుగా మారిపోతున్నాయి. కబ్బా రాయుల్లపై ఉక్కు పాదం మోపేందుకు పటిష్టమైన విభాగం, పకడ్భందీ గా పనిచేసే యంత్రాంగం తో ముందడుగు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. సమర్థుడైన అధికారిగా పేరున్న ఏవీ రంగనాథ్‌ను ప్రత్యేకంగా ఈ విభాగానికి ఇంచార్జీగా నియమించినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజిమెంట్ పరిధి విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.
———————————-