BJP Protest Against KUDA Land Auction in Warangal
* కుడా ప్రభుత్వ భూముల వేలానికి వ్యతిరేకంగా బీజేపీ భారీ ముట్టడి
* ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేస్తారా? – రావు పద్మ ధ్వజం
* ఆదాయం కోసం అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం కాంగ్రెస్ పాలనకు సిగ్గుచేటు
* వేలం నోటిఫికేషన్ను రద్దు చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక
అకేరు న్యూస్ డెస్క్ : వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) పరిధిలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములను, ముఖ్యంగా ఇటీవల ‘కుడా’ విడుదల చేసిన వేలం నోటిఫికేషన్లోని హనుమకొండ బాలసముద్రం ప్రైమ్ కమర్షియల్ ప్లాట్లను వేలం వేయాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ వేలం పాటను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయాన్ని ముట్టడించారు.
కుడా కార్యాలయంలోకి వెళ్తున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల అతి ఉత్సాహం మరియు తోపులాట కారణంగా పలువురు బీజేపీ కార్యకర్తల బట్టలు చినిగిపోయాయి. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ముట్టడి నేపథ్యంలో కూడా కార్యాలయం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, నిరసనలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ రెడ్డి జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ని పలువురు జిల్లా బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, రావు పద్మ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా?” అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన సాగించడం దుర్మార్గమన్నారు. ఆదాయం కోసం అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని, ఇది వారికి ఒక అలవాటుగా మారిందని విమర్శించారు.
అభివృద్ధి పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ ఆదాయం సమకూర్చుకోవాలని చూడడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, వేలం పాటల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.

హనుమకొండ నడిబొడ్డున ఉన్న విలువైన భూముల వేలం వ్యవహారానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తక్షణమే ఈ వేలం నోటిఫికేషన్ను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ భారీ ముట్టడి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు చాడ స్వాతి రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు సండ్ర మధు, తోపుచెర్ల అర్చన, రత్నా లక్ష్మి, జరీనా, ఆకుల శ్రీకాంత్, కూతురు రాజు, బొమ్మసాని అనిల్, కేతిపెల్లి సంపత్ రెడ్డి, అరణ్య రెడ్డి, కొండెం రవీంద్ర రెడ్డి, అలాగే డివిజన్ నాయకులు కళ్యాణ్, ఉడుతల మురళి, ఆడెపు రాజు, ప్రసాద్, శ్రీకాంత్, రేణుకుంట్ల కల్యాణ్, శ్రావణ్, మహేందర్ పటేల్, మంతూర్తి శ్రీకాంత్ యాదవ్, బీజేపీ ముఖ్య నాయకులు డి.అమర్నాథ్ రెడ్డి, మామిడాల నరేందర్, కాయిత రాజ్ కుమార్, పిట్టల రమేష్, బండి భాస్కర్, అనిల్, కవిత, తులసి, స్వర్ణ తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపారు.

