NEET Aspirant Suicide Attempt
* నీట్ ర్యాంక్ రాలేదని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి: నీట్ (NEET) పరీక్షలో ఆశించిన స్థాయిలో మార్కులు, ర్యాంకు రాలేదనే బాధతో ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పలిమెల మండలంలో చోటుచేసుకుంది.
బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన పాగే వైష్ణవి అనే విద్యార్థిని ఇటీవలే విడుదలైన నీట్ ఫలితాల్లో మార్కులు తక్కువగా రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఇంట్లోనే పురుగుల మందు తాగి పడిపోయింది.
ఇది గమనించిన వైష్ణవి తల్లిదండ్రులు వెంటనే స్పందించి, ఆమెను హుటాహుటిన మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి (CHC) తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లిలోని మోక్ష ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం మోక్ష ఆసుపత్రి వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వైద్యుల శ్రమ ఫలితంగా వైష్ణవి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
