శారద పీఠంపై రేవంత్ సర్కార్ కుట్ర..
అల్లుడి అక్రమ వ్యాపారం కోసమే ఆలయ కూల్చివేతకు యత్నం: హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లతో పాటు ఇప్పుడు ఏకంగా దేవుడి మాన్యాలు, మఠాలు, దేవాలయాలను సైతం కూల్చేందుకు బరితెగించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఉదయం కోకాపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని అధికారులు ముట్టడించిన నేపథ్యంలో ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆలయ పరిరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “2019లో కేసీఆర్ ప్రభుత్వం కోకాపేట సర్వే నంబర్ 240లో విశాఖ శారద పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని క్యాబినెట్ ఆమోదంతో చట్టబద్ధంగా కేటాయించింది. పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి రూ. 1.05 కోట్లు రిజిస్ట్రేషన్ ఫీజు, హెచ్ఎండీఏకు రూ. 23 లక్షలు చెల్లించి అన్ని అనుమతులు పొందారు. ఇక్కడ వేద పాఠశాల, గోశాల, అన్నదాన సత్రం భక్తుల సౌకర్యార్థం నడుస్తున్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ప్రతిష్ఠ జరిగిన ఈ దేవాలయాన్ని ఇప్పుడు అక్రమ కట్టడమని ముద్ర వేయడం రేవంత్ రెడ్డి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం.”
అల్లుడి కోసమే 17 ఎకరాల కబ్జా!
“వాటర్ వర్క్స్ (HMWSSB) భవనం కోసమే ఈ స్థలం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. అదే నిజమైతే, ఆలయానికి సరిగ్గా రోడ్డు అవతలే ఉన్న సర్వే నంబర్ 239, 240లలోని 17 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎందుకు వాడటం లేదు? ఆ 17 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి తన అల్లుడికి చెందిన ‘భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్’ సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పనంగా కట్టబెట్టారు. ఓపెన్ ఆక్షన్ వేస్తే ప్రభుత్వానికి వందల కోట్లు వచ్చేవి, కానీ అల్లుడి వ్యాపారం కోసం ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ORR కు కిలోమీటర్ పరిధిలో క్రషర్లు ఉండకూడదన్న నిబంధన ఉన్నా, తన బంధువుల కోసం అక్కడ 5 రెడీమిక్స్ ప్లాంట్లు పెట్టించారు.”
అర్ధరాత్రి పోలీసుల ముట్టడి – అధికారుల పరార్:
“కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా నిన్న అర్ధరాత్రి 11:30 గంటలకు వందలాది మంది పోలీసులు, ఎంఆర్ఓలు వచ్చి ఆలయం వద్ద పీఠాధిపతులను భయభ్రాంతులకు గురిచేశారు. ఉదయం నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి అధికారులు దొంగల్లా పారిపోయారు. స్వామీజీలను పూజలు చేయనీయకుండా అడ్డుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? కేసీఆర్ కట్టిన గుళ్లు, గోపురాలను కూల్చడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు.”
దైవ శాపం తప్పదు – పోరాటం ఆగదు!!
“పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేశావు.. ఇప్పుడు దేవాలయాల మీద పడ్డావు. దేవుడి మీద పడ్డవాడు ఎవడూ బాగుపడలేదు. రేవంత్ రెడ్డికి పోయేకాలం దాపురించింది, దైవ శాపం నీకు తప్పక తగులుతుంది. మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించి ఈ కూల్చివేతలను ఆపాలి. లేనిపక్షంలో భక్తులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. రాజశ్యామల ఆలయాన్ని ప్రాణాలైనా అడ్డుపెట్టి కాపాడుకుంటాం.”
