BRS Delhi Complaint
* మహిళా కమిషన్‌లో నేడు ఫిర్యాదు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో నేడు జాతీయ మహిళా కమిషన్‌ను బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘటనలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
* ఎన్ హెచ్ఆర్సీలోనూ ఫిర్యాదు..
అసెంబ్లీ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)లోనూ ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. సీఎం, పోలీసులు, స్పీకర్‌పై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ పార్టీ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.
* ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది: జగదీష్‌రెడ్డి
ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఏఐ వీడియోలను ఉపయోగించి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
* ఫిర్యాదు చేసి.. న్యాయం కోరనున్న బీఆర్ఎస్..
అసెంబ్లీ ఘటనలను జాతీయ స్థాయిలో ప్రస్తావించడంతోపాటు తమకు జరిగిన అన్యాయంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు నేతల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. మహిళా ఎమ్మెల్యేల అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనుండగా.. అసెంబ్లీ ఘటనలు, మానవ హక్కులకు సంబంధించిన అంశాలను NHRC ముందు ఉంచనున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఘటనలపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు చేయనున్న ఫిర్యాదులు, వాటిపై జాతీయ మహిళా కమిషన్, NHRC స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
