Childhood Friendship
* పాముకాటు బాధితుడికి మిత్రుల చేయూత
ఆకేరు న్యూస్, రాయపర్తి : “కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు” అని నిరూపించారు రాయపర్తికి చెందిన 2007-2008 విద్యాసంవత్సర పూర్వ విద్యార్థులు. మానవత్వం, స్నేహబంధం కలగలిసిన ఒక ఆత్మీయ సంఘటన రాయపర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
రాయపర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గౌరీ సుమన్ ఇటీవల ప్రమాదవశాత్తు పాముకాటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకున్న సుమన్ ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్నారు.
*ఆపదలో ఉన్న మిత్రునికి అండగా..
తన బాల్య మిత్రుడు పాముకాటుకు గురై ఆసుపత్రి నుంచి వచ్చి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలుసుకున్న 2007-2008 నాటి స్నేహితులు తక్షణమే స్పందించారు. సుమన్ నివాసానికి చేరుకుని, ఆయన ఆరోగ్య పరిస్థితిని మరియు చికిత్స వివరాలు, కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని అధైర్యపడవద్దని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
*నిత్యవసర సరుకుల పంపిణీ..
కేవలం పరామర్శకే పరిమితం కాకుండా, ఆ కుటుంబానికి చేయూతనందించేందుకు స్నేహితులంతా కలిసి నిత్యవసర వస్తువులను సమకూర్చారు. సుమన్ కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, వంటనూనె క్యాన్, ఇంటికి సరిపడా సమగ్ర నిత్యవసర సరుకులను ఆత్మీయంగా అందజేశారు.
*ప్రశంసల జల్లు..
సంవత్సరాలు గడిచినా, జీవితంలో ఎవరి దారిన వారు స్థిరపడినా కష్టకాలంలో బాల్య స్నేహితుడిని గుర్తుపెట్టుకుని వచ్చి ఆదుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “ఆపదలో ఆదుకున్న ఈ స్నేహితులు నిజమైన మిత్రధర్మాన్ని చాటారు” అని కాలనీవాసులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గారి విష్ణు, శీలం రాజేష్ రావు, గారే సందీప్, 2007-2008 నాటి పూర్వ విద్యార్థులు, స్నేహితులు, స్థానికులు మరియు సుమన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
