Telangana Labour Wage Hike
* స్కిల్స్ యూనివర్సిటీపై ఫోకస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని కోట్లాది మంది కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, సుదీర్ఘ చర్చల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2026 నుంచి ఈ కొత్త వేతనాలు అమలులోకి రానున్నాయి.
* గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నష్టం
గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రంలో దాదాపు 1 కోటి 11 లక్షల మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత పాలకులు తమ బాధ్యతలను విస్మరిస్తే, తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా కార్మికుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కార్మికుల సంక్షేమం కోసం ఇంతటి భారీ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేత వెంకటస్వామి (కాకా)ని స్మరించుకున్న సీఎం.. ఆయన వారసుడిగా వివేక్ కార్మికుల సంక్షేమం కోసం అద్భుతమైన చొరవ చూపారని కొనియాడారు.
* నాలుగు కేటగిరీలు.. మూడు జోన్లు..
కార్మికుల వేతనాల సవరణ కోసం ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిని అనుసరించింది. ఇందులో భాగంగా కార్మికులను నాలుగు కేటగిరీలుగా, ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించి కనీస వేతనాలను ఖరారు చేశారు.
జోన్ 1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 2 కింద మున్సిపాలిటీలు, జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలను తీసుకుని ఈ కనీస వేతనాలను నిర్ణయించడం జరిగింది.
* వేతనాల వివరాలు..
అన్ స్కిల్డ్ కేటగిరీ: ఈ కేటగిరీలో కనీస వేతనాన్ని రూ. 12,750 నుంచి రూ. 16,000 కు పెంచారు.
సెమీ స్కిల్డ్ కేటగిరీ: ఈ కేటగిరీలో కనీస వేతనాన్ని రూ. 13,152 నుంచి రూ. 17,000 కు పెంచారు.
స్కిల్డ్ కేటగిరీ: ఈ కేటగిరీలో కనీస వేతనాన్ని రూ. 13,772 నుంచి రూ. 18,500 కు పెంచారు.
హైలీ స్కిల్డ్ కేటగిరీ: ఈ కేటగిరీలో కనీస వేతనాన్ని రూ. 14,607 నుంచి రూ. 20,000 కు పెంచారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా కార్మిక లోకానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
* యువతకు సీఎం రేవంత్ రెడ్డి సూచన…
ఇదే వేదికపై యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విలువైన సూచన చేశారు. కేవలం ఐటీ ఉద్యోగాలు, అమెరికా వెళ్లాలనే వ్యామోహంలోనే ఉండిపోవద్దని ఆయన కోరారు. ఉద్యోగాలు రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అలాంటి చదువులు వ్యర్థమని స్పష్టం చేశారు.
కేవలం సాంప్రదాయ చదువులకే పరిమితం కాకుండా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి ఇతర దేశాల్లో నైపుణ్యం ఉన్న యువతకు అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. యువతలో గ్లోబల్ స్కిల్స్ పెంచడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోందని, యువత అంతా ఐటీ, అమెరికా ఆలోచనలు వీడి ఈ నైపుణ్యాల వైపు దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
