Telangana CM Revanth Reddy demands Metro TakeOver Funds
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరానికి అత్యంత ఆవశ్యకమైన మెట్రో రైలు రెండో దశ విస్తరణను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయలపై కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) అడ్డంకులు సృష్టిస్తున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి (టేకోవర్) అన్ని రకాల ఒప్పందాలు కుదిరినప్పటికీ, ఐఆర్ఎఫ్సీ నుంచి నిధులు ఎందుకు విడుదల కాలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్ మరియు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా మెట్రో టేకోవర్, నిధుల సమీకరణ మరియు రెండో దశ విస్తరణపై సవివరమైన అంశాలను వెల్లడించారు.
* నిధులు వచ్చినా, ఎందుకు ఆపారు..
మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవడానికి ₹13,500 కోట్ల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్ఎఫ్సీతో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఒప్పందాలను పూర్తి చేసుకుందని సీఎం తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కౌంటర్ గ్యారెంటీ కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.
“చర్చోపచర్చల అనంతరం కుదిరిన ఒప్పందం ప్రకారం జపాన్‌కు చెందిన ఆర్థిక సంస్థ ద్వారా నిధులు ఇప్పటికే ఐఆర్ఎఫ్సీ ఖాతాలో బదిలీ అయ్యాయి. లావాదేవీలన్నీ పూర్తయి, ఈరోజే నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ ఐఆర్ఎఫ్సీ నుంచి నిధులు ఆగిపోయాయి. దీనికి కారణం ఎవరు? తెలంగాణ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
* ₹30 వేల కోట్ల ప్రాజెక్టును ₹15 వేల కోట్లకే టేకోవర్..
ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా మెట్రోను ప్రభుత్వం హస్తగతం చేసుకుంటోందని సీఎం వివరించారు.
తక్కువ వడ్డీకే రుణం: గత ప్రభుత్వంలో ప్రాజెక్టులకు 8 నుంచి 11 శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 4 శాతం వడ్డీకే ఐఆర్ఎఫ్సీ నుంచి ₹13,600 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది.
వాటాల చెల్లింపు: ఈ రుణ ప్రక్రియ కోసం ఫీజు రూపంలో ₹84 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ వాటాగా ₹1,400 కోట్లు కూడా ఇప్పటికే చెల్లించామని సీఎం స్పష్టం చేశారు.
సగం ధరకే ప్రాజెక్ట్: హైదరాబాద్ నగరవ్యాప్తంగా మెట్రోను విస్తరించాలనే సంకల్పంతో, ₹30 వేల కోట్ల విలువైన ఈ మెట్రో ప్రాజెక్టును కేవలం ₹15 వేల కోట్లకు ఎల్ అండ్ టీ నుంచి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
* గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 9వ స్థానానికి..
నాడు యూపీఏ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిల కాలంలో హైదరాబాద్ మెట్రోకు అంకురార్పణ జరిగిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఢిల్లీ మెట్రో కంటే అద్భుతంగా నిర్మించాలనే సంకల్పంతో 2009లో టెండర్లు పిలిచి, 2020 నాటికి పూర్తి చేసినా.. పాతబస్తీ (గౌలిగూడ – ఫలక్ నుమా) మార్గాన్ని గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు.
మొదట్లో ₹15 వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్ట్ వ్యయం ₹22 వేల కోట్లకు చేరిందని, గత పదేళ్లలో విస్తరణపై దృష్టి పెట్టకపోవడం వల్లే నాడు దేశంలోనే 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో, నేడు 9వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా జనాభా 1.34 కోట్లకు చేరినందున మెట్రో విస్తరణ తప్పనిసరని పేర్కొన్నారు.
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలి..
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తోందని, కానీ తెలంగాణకు ఎందుకు ఈ వివక్ష అని సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం భరిస్తోందన్నది వాస్తవమైతే దానికి సంబంధించిన పత్రాలను చూపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న జి. కిషన్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకుని సమస్య ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే రాష్ట్ర ఎంపీలందరికీ తానే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒప్పందాల వివరాలను వివరిస్తానని సీఎం అన్నారు.
“మేం సమస్యను జటిలం చేయాలనుకోవడం లేదు. ఇది ప్రజల కోసం చేస్తున్న పని. కేంద్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (NOC) ఇస్తే, కేంద్రం వాటా ఏమీ లేకుండానే వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీతో మెట్రో రైలు రెండో దశ విస్తరణను పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
