Ward Members Training in Raiparthy
* గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం
– ఎంపీడీవో కూచన ప్రకాష్
ఆకేరు న్యూస్, రాయపర్తి: గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమైనదని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కూచన ప్రకాష్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన వార్డు సభ్యుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.
పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వార్డు సభ్యులు ప్రతి ఒక్కరూ ‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018’పై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమైనదని, చట్టాలపై మరియు తమకు ఉన్న అధికారాలపై పట్టు సాధించినప్పుడే గ్రామాల్లో పారదర్శకమైన పాలన అందించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
* సమస్యల పట్ల అవగాహన అవసరం – బత్తుల నర్సయ్య
శిక్షణా కార్యక్రమ ముఖ్య శిక్షకులు బత్తుల నర్సయ్య మాట్లాడుతూ, వార్డు సభ్యులు తమ పరిధిలోని ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి, వాటిని గ్రామసభల ద్వారా ఎలా పరిష్కరించుకోవాలో, నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఈ ఐదు రోజుల శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఓటీలు (TOTs) పద్మనాభ స్వామి, విజేందర్లు వార్డు సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణా తరగతుల్లో రాయపర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణను ప్రజాప్రతినిధులు అందరూ సద్వినియోగం చేసుకుని తమ గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని అధికారులు కోరారు.
