CM Revanth Reddy Revenue Mobilisation Review
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై అధికారులు కచ్చితంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి జరుగుతున్న లీకేజీలను అరికట్టేందుకు, రాబడులను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఒక ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ (Chasing Cell) ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీ (MCR HRD) లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావుతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
* నిర్లక్ష్యం వీడాల్సిందే.. శాఖల సామర్థ్యం పెరగాలి
ఈ సందర్భంగా ఆదాయ పెంపు, నిధుల సమీకరణ విషయంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ (HMDA), టీజీఐఐసీ (TGIIC) ల ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తో పాటు ఇతర కీలక శాఖల్లో లీకేజీలను పూర్తిగా అరికట్టాలని చెప్పారు. అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించాలంటే శాఖలవారీగా పనితీరు, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు.
* వాస్తవిక బడ్జెట్.. భూసేకరణకు తొలి ప్రాధాన్యత
“ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఊహాజనితం కాదు.. అది పూర్తిగా వాస్తవికత ఆధారంగానే రూపకల్పన జరగాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా శాఖలవారీగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా భూసేకరణను (Land Acquisition) మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల కోసం ఆయా శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు భరోసా ఇచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
