Collector Chahat Bajpai, SIR 2026 Voter List Revision
*పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు అందరి సహకారం అవసరం
*ఎస్ఐఆర్-2026 విజయవంతానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలి
*డబుల్ ఓట్లపై చట్టపరమైన చర్యలు తప్పవు
– జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి
అకేరు న్యూస్ హన్మకొండ :ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా, పారదర్శకంగా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి కోరారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఐఆర్-2026 అమలు విధానం, ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఓటర్ల బాధ్యతలపై సమగ్ర వివరణ అందించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారం పూరించే విధానాన్ని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సరైన సమాచారం చేరవేసే విషయంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఎస్ఐఆర్పై అపోహలు, అనుమానాలు తొలగించి అవగాహన పెంపొందించడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఓటరూ ఈ ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.
జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో నిర్వహించిన ముందస్తు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. వరంగల్ పశ్చిమలో 68 శాతం, పరకాలలో 87 శాతం మేర మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని చెప్పారు. వాటిని పూర్తిగా నింపి తిరిగి సమర్పించడం ద్వారా ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. అవసరమైన చోట బీఎల్వోలు, బీఎల్ఏలు మార్గనిర్దేశం చేస్తారని తెలిపారు.
మరణించిన వ్యక్తుల పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లు, బహుళ ప్రాంతాల్లో నమోదైన ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం సవరిస్తామని చెప్పారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు నమోదు అయి ఉండటం లేదా తప్పుడు వివరాలు సమర్పించడం చట్టవిరుద్ధమని, సంబంధిత వ్యక్తులపై నిబంధనల మేరకు క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
ఎస్ఐఆర్కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు, 1800 425 1126 టోల్ ఫ్రీ నంబర్
ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేకరించిన వివరాలను అనంతరం ఆన్లైన్లో నమోదు చేసి పరిశీలన చేపడతామని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడమే ఎస్ ఐ ఆర్ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే ఎస్ఐఆర్-2026 విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, డీఆర్ఓ కె. శ్రీనివాస్, డీపీఆర్ఓ అయూబ్ అలీ,ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…
