Srisailam Waters
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : Srisailam రిజర్వాయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దఎత్తున నీటిని తరలిస్తోందని తెలంగాణలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 21 రోజుల్లో ఏపీ అధికారికంగా సుమారు 53 టీఎంసీల నీటిని తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వరదజలాల పేరుతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలిస్తున్నారని తెలంగాణ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆగస్టు 21న శ్రీశైలం రిజర్వాయర్‌లో సుమారు 170 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ప్రస్తుతం అది 117 టీఎంసీలకు చేరిందని చెబుతున్నాయి. అంటే ఈ కాలంలో రిజర్వాయర్ నిల్వ గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
*ఎత్తిపోతల పథకాల మోటార్లు ఎందుకు ఆఫ్..
మరోవైపు తెలంగాణలోని కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శలు వస్తున్నాయి. ఈ మోటార్లను వెంటనే ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మోటార్లు నడపకపోవడానికి విద్యుత్ సమస్యను ప్రభుత్వం కారణంగా చూపుతోందని విమర్శలు ఉన్నాయి. ఒకవైపు ఏపీ శ్రీశైలం నుంచి నీటిని తరలిస్తుండగా.. మరోవైపు తెలంగాణకు కేటాయించిన నీటిని వినియోగించుకునేందుకు అవసరమైన ఎత్తిపోతల మోటార్లను ఎందుకు నడపడం లేదని ప్రశ్నిస్తున్నారు.
* నీటి తరలింపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాలు..
Srisailam నుంచి ఏపీ నీటి తరలింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో విద్యుత్ సమస్యల కారణంగా ఎత్తిపోతల మోటార్లు నిలిచిపోతున్నాయన్న అంశంపైనా విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
* శ్రీశైలం జలాల తరలింపు కొనసాగుతున్న వేళ..
తెలంగాణ ఎత్తిపోతల పథకాల మోటార్లు ఎందుకు నిలిపివేశారు? రాష్ట్రానికి రావాల్సిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
