Danam Nagender
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో దానం నాగేందర్‌ది ప్రత్యేక శైలి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంచనా వేయడం కష్టమే. మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానంలో గెలుపోటములతో పాటు పార్టీ మార్పులు కూడా కీలకంగా నిలిచాయి. తాజాగా అనర్హత వేటుతో మరోసారి దానం నాగేందర్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారారు.
* ఆసిఫ్‌నగర్ నుంచి ఖైరతాబాద్ వరకు..
దానం నాగేందర్(Danam Nagender) రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌తో ప్రారంభించారు. 1994లో ఆసిఫ్‌నగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఖైరతాబాద్ నుంచి 2009లో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
* పార్టీ మార్పులు..
దానం రాజకీయ ప్రస్థానంలో పార్టీ మార్పులు కూడా కీలకంగా నిలిచాయి. 2004లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో నామినేషన్ల చివరి దశలో టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆహ్వానంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో మాత్రం ఓటమి ఎదురైంది. 2018లో బీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరఫున గెలిచారు.
* మళ్లీ కాంగ్రెస్‌లోకి..
2023లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మార్చిలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై పార్టీ ఫిరాయింపుల అంశం వివాదంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా దాఖలు చేసిన బీ-ఫారం కూడా ఈ వ్యవహారంలో కీలక ఆధారంగా మారింది. బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానాల్లో విచారణ జరిగింది. తాజాగా అనర్హత వేటుతో దానం నాగేందర్ మాజీ ఎమ్మెల్యేగా మారారు.
* ఉప ఎన్నికపై ఉత్కంఠ
అనర్హత వేటు తర్వాత దానం నాగేందర్ స్పందిస్తూ న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని టికెట్ వచ్చే వరకు వెల్లడించబోనని చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఖైరతాబాద్ ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకాన్ని దానం వ్యక్తం చేశారు. దీంతో రాబోయే ఉప ఎన్నికలో ఆయన ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
