Dharani Portal Land Issues
* 1 కోటి ఎకరాల ప్రచారం అబద్ధం..
*ప్రైవేట్ భూములు 3.77 లక్షల ఎకరాలే
* రెవెన్యూ వ్యవస్థ ఒక మాయా లోకం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో భూములు, రెవెన్యూ వ్యవస్థ మరియు ‘ధరణి’ పోర్టల్ సమస్యలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ అనేది ఒక “మాయా లోకం” అని, అక్కడ అంకెలు, సంఖ్యలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
*22A నిషేధిత భూములపై అసత్య ప్రచారం వద్దు..
ధరణి పోర్టల్ రావడం వల్లే కోటి ఎకరాల భూములు నిషేధిత జాబితా (22A)లోకి వెళ్లాయనే ప్రచారంలో వాస్తవం లేదని కూనంనేని స్పష్టం చేశారు. అడవి, అసైన్డ్, ప్రభుత్వ భూములు, పార్ట్-బి కింద ఉన్న భూములన్నింటినీ కలిపి చూపించడం వల్లే 90 లక్షల ఎకరాల పైచిలుకుగా సంఖ్య కనిపిస్తోందని తెలిపారు. వాస్తవానికి నిరోధించబడిన ప్రైవేట్ వివాదాస్పద భూములు కేవలం 3,77,000 ఎకరాలు మాత్రమేనని, ఈ సమస్యను ప్రత్యేక అధికారులను (కలెక్టర్లను) నియమించి, ఒక నిర్దిష్ట కాలపరిమితి (Time Bound) పెట్టుకుని వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
*గత ప్రభుత్వ వైఫల్యాలు..
గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అడావుడిగా తీసుకొచ్చి తీవ్ర తప్పులు చేసిందని విమర్శించారు. సర్వే నంబర్లలో ‘సబ్-డివిజన్’ (బై నంబర్లు) తొలగించడం వల్ల, ఒక సర్వే నంబర్లో కొంత ప్రభుత్వ భూమి ఉంటే.. ఆ నంబర్లోని మిగతా ప్రైవేట్ భూమి మొత్తాన్ని నిషేధిత జాబితాలో పెట్టేసి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని మండిపడ్డారు. అలాగే ‘కాస్తుదారుల కాలమ్’ (సాగుదారుల వివరాలు) తొలగించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, ఇది కూడా గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.
* ప్రభుత్వానికి పలు సూచనలు..
తెలంగాణలో భూమి అనేది ప్రజల జీవితాలతో ముడిపడి ఉందని, 1945 నుండి సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమరం భీమ్ వంటి వీరుల త్యాగాలను, కమ్యూనిస్టుల భూ పోరాటాలను ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందడుగు వేయాల్సిన పలు విషయాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. భూదాన్ ఉద్యమం కింద వచ్చిన వేల ఎకరాల భూములు ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉన్నాయో తేల్చడానికి సమగ్ర విచారణ జరిపించాలి.
*ఆక్రమణల తొలగింపు..
నిజాం నవాబుల భూములు (సర్ఫేఖాస్), చెరువులు, కుంటలు, దేవాదాయ భూములు ఎవరి ఆక్రమణల్లో ఉన్నాయో బయటకు తీసి, వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇంటి స్థలాలుగా కేటాయించాలి. పేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములకు రక్షణ కల్పించి, బడా బాబుల చేతుల్లోకి వెళ్లిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎనిమీ/ఫరారీ ప్రాపర్టీల లెక్కలు కూడా తేల్చాలి. ఇదే క్రమంలో సభలోని సభ్యులందరికీ విడివిడిగా మైక్ సౌకర్యం కల్పించాలని, పక్కన ఉన్నవారు మాట్లాడినప్పుడు లేదా గందరగోళం ఉన్నప్పుడు మిగతా వారికి ఇబ్బంది కలుగుతోందని స్పీకర్‌ను కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
