NEET Qualified Train Thief
* గర్ల్‌ఫ్రెండ్ క్యాన్సర్ వైద్యం కోసం రూ.80 లక్షలు.
* నీట్ అర్హత సాధించిన యువకుడు రైలు దొంగగా మారాడు..
ఆకేరు న్యూస్, న్యూ ఢిల్లీ : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ (NEET) సాధించిన ఓ ఉన్నత చదువుల యువకుడు.. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, చివరకు రైలు దొంగగా మారిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి క్యాన్సర్ చికిత్సకు భారీగా ఖర్చు కావడం, వ్యాపారంలో నష్టాలు రావడం, విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించేందుకు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరిని ఆగ్రా కాంట్ జీఆర్పీ (GRP) పోలీసులు అరెస్ట్ చేశారు.
* నిద్రిస్తున్న మహిళలే లక్ష్యం..
పోలీసులు అరెస్ట్ చేసిన వారిని ఉత్తరప్రదేశ్‌లోని పిలిభీత్కు చెందిన పునీత్, లక్నోకు చెందిన ఆకాష్ పాల్గా గుర్తించారు. వీరిద్దరూ ఒక ముఠాగా ఏర్పడి రాత్రి సమయంలో నడిచే రైళ్లలోని ఏసీ-1, ఏసీ-2, ఏసీ-3 కోచ్‌లలో ప్రయాణించే మహిళలనే ప్రధాన లక్ష్యంగా చేసుకునేవారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అనుమానం రాకుండా వారి బ్యాగుల జిప్‌లను నెమ్మదిగా తెరిచి నగదు, విలువైన బంగారు ఆభరణాలను అపహరించేవారని విచారణలో వెల్లడైంది.
సాధారణ రైలు బోగీలతో పోలిస్తే ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారి వద్ద విలువైన వస్తువులు, నగదు ఎక్కువగా ఉంటాయని భావించి వీరు ఏసీ బోగీలపైనే దృష్టి సారించారు. చోరీ పూర్తయిన వెంటనే తర్వాతి స్టేషన్లో దిగిపోయి, మరో ప్రాంతానికి వెళ్లి తలదాచుకోవడం వీరి శైలి.
*రూ.25 లక్షల ఆభరణాల స్వాధీనం..
ఈ ఏడాది ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో ఆగ్రా పరిధిలో చోటుచేసుకున్న రెండు పెద్ద రైలు చోరీ కేసుల దర్యాప్తులో భాగంగా జీఆర్పీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సాంకేతిక ఆధారాలు, కదలికలను పరిశీలించి పునీత్, ఆకాష్ పాల్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలు గతంలో జరిగిన పలు రైలు చోరీలకు సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
*నీట్ అర్హత సాధించి.. దొంగగా మారి..
ఈ కేసులో ప్రధాన నిందితుడు పునీత్ వెల్లడించిన వివరాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేశాయి. తాను 2017లో నీట్ పరీక్షలో అర్హత సాధించినట్లు పునీత్ తెలిపాడు. వైద్య విద్యలోకి వెళ్లే అవకాశం ఉన్న వ్యక్తి చివరకు రైళ్లలో (Train Thief) చోరీలకు పాల్పడే స్థాయికి ఎలా దిగజారాడనే అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అతడి విద్యార్హతలపై పోలీసు అధికారులు స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతున్నారు.
*క్యాన్సర్ చికిత్సకు రూ.80 లక్షలు..
విచారణలో పునీత్ తన నేరాల వెనుక ఉన్న కారణాలను వెల్లడించాడు. తన ప్రియురాలు క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఆమె చికిత్స కోసం ఇప్పటివరకు దాదాపు రూ.80 లక్షలు ఖర్చు చేశానని చెప్పాడు. అంతకుముందు లక్నోలో తాను నిర్వహించిన హుక్కా పార్లర్ కరోనా లాక్డౌన్ సమయంలో మూతపడటంతో భారీగా నష్టపోయినట్లు తెలిపాడు.
వ్యాపారంలో నష్టాలు, ప్రియురాలి వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో పాటు ఖరీదైన దుస్తులు, పబ్‌లు, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ ఖర్చుల కోసమే చోరీల బాట పట్టానని ఒప్పుకున్నాడు. అయితే ప్రియురాలి చికిత్స పత్రాలను, ఆర్థిక లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
* 27కు పైగా కేసులు..
ప్రధాన నిందితుడు పునీత్‌పై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 27కు పైగా కేసులు నమోదై ఉన్నట్లు ఆగ్రా జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఒక ప్రాంతంలో (Train Thief) చోరీ చేసిన తర్వాత వేరొక రాష్ట్రానికి లేదా జిల్లాకు పారిపోయి పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేవారని అధికారులు వెల్లడించారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా? చోరీ చేసిన సొత్తును ఎవరికి విక్రయించేవారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
* ప్రయాణికులకు పోలీసుల హెచ్చరిక..
రాత్రివేళల్లో రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు తమ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు. నిద్రించే సమయంలో నగదు, బంగారు ఆభరణాలను సులభంగా అందుబాటులో ఉండే బ్యాగుల్లో పెట్టకుండా, సీటుకు బిగించి సురక్షితంగా ఉంచుకోవాలని కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
