Vijayawada Hubballi Express Fire
* విజయవాడ – హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన
* తప్పిన పెను ప్రమాదం
ఆకేరు న్యూస్, విజయవాడ : విజయవాడ నుంచి హుబ్లీ వెళ్తున్న ఎస్ఎస్ఎస్ హుబ్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 17330)లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బళ్లారి స్టేషన్ దాటిన 15 నిమిషాల తర్వాత, రాత్రి ఒంటిగంట సమయంలో A1 ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఎలుక విద్యుత్ వైర్లను కొరకడంతోనే షార్ట్ సర్క్యూట్ సంభవించిందని రైల్వే సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులలో భయం పోగొట్టేందుకు సిబ్బంది చనిపోయిన ఎలుక ఫోటోను కూడా చూపించారు.
* కిరణ్ సమయస్ఫూర్తి..
బోగీలో దుప్పట్లు అందజేసే కే. కిరణ్ సమయస్ఫూర్తి వల్ల తృటిలో పెను ప్రమాదం తప్పిందని కొందరు ప్రయాణికులు పేర్కొంటున్నారు. పది నిమిషాల వ్యవధిలో రైలు మూడుసార్లు రైలు నడకలో కొంత తేడా రావడంతో అనుమానం వచ్చిన కిరణ్, బోగీ చివరకు వెళ్లి పరిశీలించగా పొగలు రావడం గమనించారు. ఆయన వెంటనే రైల్వే సిబ్బందిని, నిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేశారు. సిబ్బంది వెంటనే ఫైర్ ఎక్స్టింగ్వైషర్ సాయంతో మంటలు, పొగను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
* ప్రయాణికుల్లో కలకలం
అగ్నిప్రమాదం వార్తతో రైలులో ఉన్న ప్రయాణికులు అందరూ ప్రాణభయంతో బయటకు ఒకేసారి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో రైలు దిగే క్రమంలో తీవ్ర కలకలం రేగింది. అర్ధరాత్రి కావడంతో గాఢాంధకారం, పట్టాల పక్కన ఉన్న నిర్మాణ సామగ్రి కారణంగా తోపులాట జరిగి పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హడావుడిలో కొందరు తమ సెల్ఫోన్లు, విలువైన బ్యాగులను బోగీలోనే వదిలేయగా, మరికొందరు కిందకు విసిరేసి పోగొట్టుకున్నారు. రైల్వే సిబ్బంది బోగీ సమస్యను సరిచేసి, భరోసా ఇచ్చిన తర్వాత ప్రయాణికులు తిరిగి రైలు ఎక్కారు.
అయితే, మరమ్మతుల అనంతరం సామాన్లు సర్దుకునేందుకు తగినంత సమయం ఇవ్వలేదని కొందరు వాపోయారు. కేవలం టార్చ్‌లైట్ సంకేతాలతోనే హడావుడిగా రైలును కదిలించడంపై ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ అప్రమత్తత, సిబ్బంది తక్షణ స్పందన వల్ల ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
