* గుండెలు పగిలేల రోదిస్తున్న తల్లిదండ్రులు
ఆకేరు న్యూస్, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారిని ఓ పెంపుడు కుక్క పీక్కుతిని చంపేసింది. ఆ దారుణాన్ని చూసి తల్లిదండ్రుల గుండెలుపగిలిపోయాయి. కన్నీరుమున్నీరయ్యారు. తాండూరు బసవేశ్వర్ నగర్లో నివసిస్తున్న దత్తు-లావణ్య దంపతులకు ఐదు నెలల బాబు ఉన్నాడు. వీళ్లు ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉన్నట్టుంది ఆ కుక్క చిన్నోడిపై విరుచుకుపడింది. ముఖంపై రక్తంకారేలా దారుణంగా కొరికేసింది. పెంపుడు కుక్క దాడిలో ఆ పసివాడు తల్లడిల్లాడు. ఇంతలో కేకలు విని తల్లిదండ్రులు హుటాహుటిన పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విగతజీవిగా మారిన పసివాడిని చూసి గుండెలుపలిగేలా రోదించారు తల్లిదండ్రులు. ఇంట్లో ఒకడిగా, కాపలాగా ఉంటుందని తెచ్చుకున్న తమ పెంపుడు కుక్కే అంత దారుణానికి ఒడిగట్టడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో కుంగిపోతోంది.
————————-