* అవగాహన రాహిత్యంతోనే ఉత్తమ్ వ్యాఖ్యలు
* మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాకే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కట్టాలి
* పరిష్కరించలేని సమస్యల కారణంగానే అక్కడ మేం కట్టలేకపోయాం
* ప్రత్యామ్నాయంగానే మేడిగడ్డ తెరపైకి వచ్చింది..
* పిల్లర్ల కుంగుబాటు ఓ దురదృష్టకరమైన ఘటన
* అలా జరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు..
* పరీక్షలు చేయకుండానే లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ, ప్రభుత్వం ఎలా నిర్దారిస్తాయి?
* రాజకీయాలను పక్కనబెట్టి.. రైతంగానికి మేలు చేసే చర్యలు చేపట్టండి..
* అలా చేస్తే మీ ప్రభుత్వానికీ మంచి పేరు
* కాళేశ్వరంపై ఢిల్లీలో ఉత్తమ్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘ వివరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజకీయాలను పక్కనబెట్టి.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram project) ను పునర్వినియోగంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వాని (Telangana Government)కి మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి (Irrigation Minister) గా ఏడు నెలలు గడిచినా ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్న ఢిల్లీ (Delhi)లో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ప్రభుత్వంపైన, ఎన్డీఎస్ ఏ (NDSA)తీరునూ దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (National Dam Safety Authority) సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పత్రికా సమావేశం నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు పేలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెబుతూనే, మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదని చెప్పడం ఉత్తమ్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. వర్షాకాలం వరదలు రాకముందే.. జూలై మొదటి వారం లోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలో పేర్కొన్నా.. ప్రభుత్వం జాప్యం చేసిందని, ఇప్పుడు వరదల కారణంగా పరీక్షలు ఆపివేసినట్టు చెబుతున్నారని అన్నారు. ఈ వైఫల్యానికి ఎన్డీఎస్ఏ (NDSA) నిర్లక్ష్య వైఖరి కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అలాంటి సంస్థ చేయాల్సిన పనికాదు..
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ 2023 అక్టోబర్ చివరలో హడావుడిగా వండి వార్చిన రాజకీయ నివేదికపై ఆనాడే విమర్శలు వెల్లువెత్తాయి. ఎటువంటి పరిశీలన, భూభౌతిక పరీక్షల ఫలితాలు లేకుండానే, తెలంగాణ ఇంజనీర్లతో చర్చకుండానే లోపాలను నిర్ధారించడం కేంద్ర ప్రభుత్వ అధీనంలో పని చేసే ఒక సాంకేతిక సంస్థ చేయాల్సిన పనికాదని విమర్శించారు. ప్లానింగ్ లోపాలు ఉండవచ్చునని, డిజైన్ లో లోపాలు ఉండవచ్చునని, నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉండవచ్చునని, నిర్వాహణ లోపాలు ఉండవచ్చునని ఊహాగానాలతో కేంద్రంలోని పాలక పక్షానికి ఎన్నికల్లో లబ్ది చేకూర్చడానికి నివేదికను వండి వార్చినట్టు ఉందని విమర్శించారు. మరో గమ్మతయిన విషయం ఏంటంటే… అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ నది గర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని డ్యాం సేఫ్టీ అథారిటీ వారే ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం అన్నారు. పిల్లర్లు కుంగడం దురదృష్టకర ఘటన అని, అలా జరగాలని ఏ ప్రభుత్వం గాని, ఇంజనీర్లు గాని కోరుకోరని పేర్కొన్నారు.
విలువైన కాలాన్ని వృథా చేశారు..
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కీలక సూచనలు చేస్తారని ఆశించిన ప్రాజెక్టు ఇంజనీర్ల (Project Engineers) కు తీవ్ర నిరాశ ఎదురైందని, వారు రెండుసార్లు పర్యటించి పోలీసుల తరహాలో రహస్య విచారణ చేపట్టి రెండు నెలలు గడచినా వారి నుంచి చడీ చప్పుడు లేదని తెలిపారు. పి సి ఘోష్ విచారణ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతే తాత్కాలిక రక్షణా చర్యలు సూచిస్తూ మే నెలలో నివేదిక్ పంపినట్లు గుర్తు చేశారు. ఆ నివేదికలో తమకు తెలియని కొత్త పరిష్కార మార్గాలు ఏమీ లేవని, తాము చెప్పిన పరిష్కార మార్గాలే తమకు సూచించారని, దీని కోసం నాలుగు నెలల విలువైన కాలాన్ని హరించి వేశారని ఇంజనీర్లు వాపోయారని వెల్లడించారు. గోదావరికి వరదలు రాకముందే బ్యారేజీకి సరైయిన రక్షణ చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం NDSA నివేదిక కోసం ఎదురు చూస్తూ 4 నెలల విలువైన కాలాన్ని వృథా చేసి, ఇప్పుడేమో వరదల కారణంగా పరీక్షలు ఆపివేశామని చెప్పడం బాధ్యతా రాహిత్యం కాదా అని మంత్రి ఉత్తమ్‌ను మాజీ మంత్రి హరీశ్ ప్రశ్నించారు. వానాకాలం ముగిసే నాటికి NDSA నుంచి శాశ్వత రక్షణ చర్యలకు సంబందించిన నివేదికను తెప్పించుకోవాలని మంత్రికి సూచించారు.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు అంత ఈజీ కాదు..
తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతాం అని ఉత్తమ్ కుమార్ అనడం సంతోషమే కానీ, అది అంత ఈజీ కాదన్నారు. తమ ప్రభుత్వం గతంలోనే 148 మీటర్ల ఎత్తు వద్ద బ్యారేజి నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించిందని, చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం కూడా చేసిందని తెలిపారు. పరిష్కారం కాలేని సమస్యల వల్యే అక్కడ కట్టలేకపోయామని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కడతామన్న ఉత్తమ్.. ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వద్దనా ? 152 మీటర్ల వద్దనా ? అనేది స్పష్టం చేయాలన్నారు. 152 మీటర్ల వద్ద బ్యారేజి కట్టాలని అనుకుంటే మొదట మహారాష్ట్రా ప్రభుత్వాన్ని ఒప్పించాలని, ఆ తర్వాతే పనులు ప్రారంభించాలని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో, మహారాష్ట్రాలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏలుతున్న కాలంలోనే 152 మీటర్ల వద్ద బ్యారేజి నిర్మాణానికి ఒప్పందం చేసుకోలేక చేతులెత్తేసింది మీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. 2013 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ రాసిన లేఖలోని అంశాలు ఉత్తమ్ మరొక్కసారి చదువుకోవాలని సూచించారు. తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని ఎల్లంపల్లికి తీసుకు రావచ్చు అన్న అబద్దపు ప్రచారాన్ని సాగునీటి మంత్రిగా పదవి స్వీకరించిన 7 నెలల తర్వాత కూడా నమ్మడం విచిత్రమన్నారు. తమ ప్రభుత్వంలో తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి ఒప్పందంన ఉన్నా, కొన్ని సమస్యల వల్ల చేపట్ట లేకపోయామని, ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బ్యారేజీని ప్రతిపాదించామని తెలిపారు.
అలా తెరపైకి వచ్చిందే మేడిగడ్డ
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణానికి సాంకేతికంగా అడ్డంకులు, మహారాష్ట్రా భూభాగంలో చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం ఉండడం, భారీ వ్యయం కారణంగానే అక్కడ నిర్మాణం అగిందని హరీశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో అట్టహాసంగా, ఆర్భాటంగా కాళేశ్వరం నిర్మాణం చేశారని, ఎక్కువ పైసలు ఖర్చు పెడితే, ఎక్కువ కమీషన్ వస్తుందనే కక్కుర్తి తో నిర్మాణం చేపట్టారని ఉత్తమ్ నాటి తమ ప్రభుత్వం మీద మరొకసారి అక్కసు వెళ్ళగక్కారని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి, తర్వాత 4.3.2015 న తుమ్మిడిహట్టి వద్ద భవిష్యత్ లో నీటి లభ్యత అనుమానాస్పదమని కేంద్ర జల సంఘం లేఖ రాసిన తర్వాత ప్రాజెక్టు సాఫల్యత కోసం ప్రత్యామ్నాయం వెదకాల్సి వచ్చిందని, ఆ వెదుకులాటలోమ దొరికిందే మేడిగడ్డ అని తెలిపారు. ప్రాజెక్టుకు 80,190 కోట్లకు వ్యయానికి కేంద్ర జల సంఘం అనుమతిని జారీ చేసిందని, ఆ తర్వాత గోదావరి జలాలపై మన హక్కులను స్థిర పరచుకోవడానికి అదనపు టిఎంసి పనులను ప్రారంభించిందని, ఆ ఖర్చును కూడా కలిపి సవరించిన డిపిఆర్ ను 1,27,000 కోట్లకు కేంద్ర జల సంఘానికి పంపించామని హరీశ్ వివరించారు. ఇకనైనా రాజకీయాలు పక్కనబెట్టి బ్యారేజీని పునరుద్దరించి ప్రాజెక్టును మళ్ళీ వినియోగంలోకి తీసుకు రావలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగం అదే కోరుకుంటోందన్నారు. ఉత్తం రాజకీయ విమర్శలు కట్టిపెట్టి ప్రాజెక్టు పునర్ వినియోగంలోకి తీసుకు రావడం పట్ల శ్రద్ధ పెడితే రైతాంగానికి మేలు జరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని సూచించారు.
——————————-