* 30 ఏళ్ల అనంతరం కోర్టు తీర్పు
ఆకేరు న్యూస్ డెస్క్ : నకిలీ ఎన్కౌంటర్ (Fake Encounter) రుజువుకావడంతో ఇద్దరు అధికారులకు న్యాయస్థానం శిక్ష విధించింది. ఓ విశ్రాంత డీఐజీకి (DIG) ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, మరో విశ్రాంత డీఎస్పీ (DSP) యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1993 జూన్ 22న చమన్లాల్తో పాటు, ముగ్గురు కుమారులు ప్రవీణ్ కుమార్, బాబీ కుమార్, కూరగాయల వ్యాపారి అయిన గుల్షన్ కుమార్ ఇంట్లోనే ఉన్నారు. ఓ కేసులో విచారణ పేరుతో అప్పటి తరన్‌తారన్ (Tarn Taran) డీఎస్పీ దిల్బాగ్ సింగ్ (Dilbagh Singh), స్టేషన్ హౌస్ ఆఫీసర్ గురుబచన్ సింగ్‌లను (Gurbachan Singh) పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. చమన్‌లాల్, ఇద్దరు కుమారులను కొద్ది రోజుల తరువాత విడుదల చేయగా, గుల్షన్ కుమార్‌ను మాత్రం కస్టడీలోనే ఉంచారు.
ఆ ముగ్గురిలో ఒకడిగా..
1993 జులై 22న గుల్షన్‌తో పాటు మరో ముగ్గురు ఎన్కౌంటర్లో మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. వారిని గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్న పోలీసులు శవాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. వారే అంత్యక్రియలు చేశారు. మరణించిన వారిని జీరాకు చెందిన అన్నదమ్ములు కర్నెయిల్, జర్నెయిల్, మురాద్పురకు చెందిన హర్జీందర్ సింగ్‌గా గుర్తించారు. విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ 1995లో ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగా 1999లో దిల్బాగ్ సింగ్, గురుబచన్ సింగ్‌లతో పాటు ఎఎస్ఐలుగా పనిచేసిన అర్జున్ సింగ్, దావీందర్ సింగ్, బల్బీర్ సింగ్‌లపై ఛార్జిషీటు దాఖలయింది.
30 ఏళ్ల తర్వాత..
విచారణపై పలు కోర్టుల నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో 2022 ఫిబ్రవరి 7న అభియోగాలు నమోదు చేశారు. 2022 ఫిబ్రవరి 25న తొలిసాక్షి తన వాంగ్మూలం ఇచ్చారు. పంజాబ్‌లోని తరన్‌తారన్‌కు చెందిన చమన్‌లాల్ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేసి, వినిపించిన వాదనలు మేరకు వారికి శిక్ష వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సంఘటన జరిగిన దాదాపు 30 ఏళ్ల అనంతరం కేసు విచారణ జరిగింది. విచారణ జరుగుతున్న సమయంలో ఎఎస్ఐలు మరణించడంతో వారికి ప్రస్తుతం శిక్షలు పడలేదు.
———————–