*వీడని లవ్లీ యూనివర్సిటీలో రేప్ మిస్టరీ * విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటున్న విద్యార్థులు * అలాంటిదేమీ లేదంటున్న యూనివర్సిటీ అధికారులు * గుర్తుతెలియని వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు * తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్యతో మరింత అనుమానాలు * కప్పిపుచ్చారా..? తప్పుడు సమాచారమా..? * సిట్ విచారణలో తేల్చాల్సిందే..?
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (Lovely Professional University-LPU) బాలికల హాస్టల్-3 (Girls Hostel-3).. రూమ్ నంబర్ 504లో అసలేం జరిగింది..?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఇదీ..!
సెప్టెంబర్ 23న ఈ గదిలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని విద్యార్థుల్లో ప్రచారం మొదలైంది. ఆ ఘటనను యూనివర్సిటీ యాజమాన్యం కప్పిపుచ్చిందన్న ఆరోపణలతో వేలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. మరో వైపు అదే రూమ్‌లో ఉంటున్న విద్యార్థినులు మాత్రం తమ గదిలో అలాంటి ఘటన జరగలేదని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
సుమారు రెండు వారాల కిందట ఇదే యూనివర్సిటీలో తెలంగాణకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఇప్పుడు యూనివర్సిటీ ఘటనలకు ఆజ్యం పోసింది. ఈ పరిణామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదైంది. పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team-SIT) ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో నిజాల నిగ్గు తేలాల్సి ఉంది.. .
* రూమ్ నంబర్ 504 లో అసలేం జరిగింది..?
విద్యార్థుల్లో ప్రచారంలోకి వచ్చిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 23న బాలికల హాస్టల్-3లోని రూమ్ నంబర్ 504లో ఒక విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.బయటి నుంచి యూనివర్సిటీలోకి వచ్చిన ఓ కార్మికుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయంలోనూ భిన్నమైన వాదనలు ఉన్నాయి.
కొందరు పెయింటర్ (Painter) అని, మరికొందరు ప్లంబర్ (Plumber) అని, ఇంకొందరు నిర్మాణ కార్మికుడు (Construction Worker) అని పేర్కొన్నారు. ఇదే విషయం విద్యార్థుల మధ్య, సామాజిక మాధ్యమాల్లో (Social Media) వేగంగా వ్యాపించింది. ఇంకే ముంది లవ్లీ యూనివర్సిటీలో ఆందోళనలకు తెరతీసింది..
వివాదానికి కేంద్రంగా మారిన రూమ్ నంబర్ 504ను పోలీసులు పరిశీలించారు. ఆ గదిలో గత రెండు నెలలుగా ముగ్గురు విద్యార్థినులు ఉంటున్నారు. రూమ్ నంబర్ 504 పరిశీలించిన అనంతరం తమ గదిలో అత్యాచారం వంటి ఘటన ఏదీ జరగలేదని ఆ ముగ్గురు విద్యార్థినులు పోలీసులకు చెప్పినట్లు జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా (DIG Naveen Singla) వెల్లడించారు.పక్క గదుల్లోని విద్యార్థులను కూడా పోలీసులు ప్రశ్నించారు.
ఆరోపణకు బలం చేకూర్చే సమాచారం ప్రాథమిక విచారణలో లభించలేదని అధికారులు పేర్కొన్నారు.హాస్టల్‌కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను (CCTV Footage) కూడా పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు.
* బాధిత విద్యార్థిని ఎవరు..?
ఈ కేసులో ప్రధానంగా సమాధానం దొరకాల్సిన ప్రశ్న బాధిత విద్యార్థిని గురించే. అత్యాచారం జరిగిందని విద్యార్థుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ, బాధితురాలిగా చెబుతున్న విద్యార్థిని ఎవరు అనే విషయం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు.
ఆమెను యూనివర్సిటీ యాజమాన్యం ఇంటికి పంపించిందని ఒక ప్రచారం జరిగింది. అత్యాచారం తర్వాత విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ మరో సమాచారం వ్యాపించింది.
నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులు సైతం బాధితురాలు ఎవరో తమకు తెలియదని మీడియాకు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.ఈ పరిణామాల నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదు లేకుండానే రేప్ కేసు పోలీసులు నమోదు చేశారు.
సత్నాంపుర పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita-BNS) సెక్షన్ 64 కింద గుర్తుతెలియని వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.
కాగా సెప్టెంబర్ 23న బాలికల హాస్టల్-3లో ఒక విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని, యూనివర్సిటీ యాజమాన్యం ఆ విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నించిందని మరో విద్యార్థిని చేసిన ఆరోపణ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
* తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య.. అసలేం జరిగింది?
లవ్లీ యూనివర్సిటీ వివాదంలో మరో ఘటన ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తోంది.ప్రస్తుత ఆందోళనలకు సుమారు రెండు వారాల ముందు ఇదే యూనివర్సిటీలో తెలంగాణకు చెందిన ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఆ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు కూడా యూనివర్సిటీకి వచ్చినట్లు జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా వెల్లడించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని తెలిపారు.
విద్యార్థిని ఫోన్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఎవరితో మాట్లాడింది..? ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది..? మరేదైనా కారణం ఉందా..? అనే అంశాలపై ఆ కేసులో విచారణ జరుగుతోంది.
ప్రస్తుతం లవ్లీ యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పాత ఘటన కూడా విద్యార్థుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. అయితే తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్యకు సెప్టెంబర్ 23న జరిగిందని ఆరోపిస్తున్న అత్యాచార ఘటనకు సంబంధం ఉందా లేదా అన్న విషయం కూడా సిట్ విచారణలో తేలాల్సి ఉంది..
* ఒక్కసారిగా భగ్గుమన్న క్యాంపస్
అత్యాచార ఆరోపణ విద్యార్థుల్లో వ్యాపించడంతో యూనివర్సిటీ క్యాంపస్‌లో పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి.విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు.
మహిళా హాస్టళ్లలో భద్రత, బయటి వ్యక్తుల ప్రవేశం, విద్యార్థుల ఫిర్యాదులపై యాజమాన్యం స్పందిస్తున్న తీరు వంటి అంశాలను కూడా విద్యార్థులు ప్రస్తావిస్తున్నారు..యూనివర్సిటీలోని అద్దాలు, ఫర్నిచర్, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి. క్యాంపస్‌లో ప్రదర్శనకు ఉంచిన మిగ్-23 యుద్ధ విమానం (MiG-23 Fighter Aircraft), ట్యాంక్‌పైకి కొందరు ఎక్కారు.
జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారి-44 (NH-44)ను విద్యార్థులు దిగ్బంధించారు.తర్వాత జరిగిన ఘర్షణల్లో పోలీసులపై రాళ్లు రువ్వడం, పోలీసు వాహనానికి నిప్పుపెట్టడం, ఇతర వాహనాలు ధ్వంసం కావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
విధ్వంసానికి పాల్పడిన వారందరూ యూనివర్సిటీ విద్యార్థులేనా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆందోళన సమయంలో విద్యార్థులతో కలిసిపోయి కొందరు బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.విధ్వంసానికి సంబంధించిన వీడియోలు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి వ్యక్తులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.
* అసలు అలాంటి ఘటనే జరగలేదు
– లవ్లీ యూనివర్సిటీ అధికారులు
సామాజిక మాధ్యమాల్లో అసత్యమైన, నిరాధారమైన సమాచారం వ్యాప్తి చెందిందని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మోనికా గులాటి (Registrar Monica Gulati) పేర్కొన్నారు.యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని యాజమాన్యం ఆరోపించింది.
రూమ్ నంబర్ 504లో ఉంటున్న విద్యార్థినుల వాంగ్మూలాలను కూడా యూనివర్సిటీ తన వాదనకు బలంగా చూపుతోంది.యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం అత్యాచార ఆరోపణలను ఖండించింది.
* రంగంలోకి ప్రత్యేక దర్యాప్తు బృందం
వివాదం తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (Special Investigation Team-SIT) ఏర్పాటు చేశారు.అత్యాచార ఆరోపణతో పాటు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది..? బాధితురాలిగా చెబుతున్న విద్యార్థిని ఉన్నారా..?హాస్టల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించారా..? సీసీటీవీ దృశ్యాల్లో ఏముంది..? యూనివర్సిటీ అధికారులకు ముందుగా ఏమైనా సమాచారం అందిందా..? అనే అంశాలపై లోతైన విచారణ చేస్తున్నారు.
విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారడానికి కారణాలు, విధ్వంసంలో బయటి వ్యక్తుల పాత్ర ఉందా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
* పది రోజులు తరగతులకు బ్రేక్
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సెప్టెంబర్ 28 నుంచి పది రోజులపాటు సాధారణ తరగతులను (Regular Classes) నిలిపివేసింది. మధ్యంతర పరీక్షలను (Mid-Term Examinations) తదుపరి సమాచారం వరకు వాయిదా వేసింది.
స్వస్థలాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తల్లిదండ్రులతో సంప్రదించి వెళ్లవచ్చని యూనివర్సిటీ తెలిపింది. క్యాంపస్‌లో కొనసాగాలనుకునే విద్యార్థులు హాస్టళ్లలో ఉండాలని సూచించింది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను కూడా యూనివర్సిటీ పరిసరాల్లో మోహరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
