Gajuwaka Snake Incident
* కదల్లేక చిక్కిన నాగుపాము
* గాజువాకలో ఆసక్తికర ఘటన
ఆకేరు న్యూస్ విశాఖపట్నం : కోడిగుడ్ల కోసం కోళ్లగూటిలోకి వెళ్లిన ఓ నాగుపాము ఏకంగా 12 గుడ్లను మింగేసి, ఆ తర్వాత కదల్లేని స్థితిలో అక్కడే ఉండిపోయిన ఘటన విశాఖపట్నం గాజువాక పరిధిలో ఆసక్తికరంగా చోటుచేసుకుంది. గుడ్లన్నీ మింగిన అనంతరం భుక్తాయాసంతో కదల్లేకపోయిన పామును స్నేక్ క్యాచర్ సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
గాజువాక పరిధిలోని అగనంపూడి శనివాడకాలనీకి చెందిన రైతు కె. నరేష్ ఇంటి ఆవరణలో కోళ్ల కోసం ప్రత్యేకంగా గూడు ఏర్పాటు చేసుకున్నారు. అందులో కోళ్లు గుడ్లు పెట్టేవి. అయితే ఇటీవల సుమారు ఆరడుగుల పొడవున్న నాగుపాము ఆ కోళ్లగూటిలోకి ప్రవేశించింది.
గూటిలో ఉన్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా మింగిన నాగుపాము మొత్తం 12 కోడిగుడ్లను మింగినట్లు తెలుస్తోంది. గుడ్లన్నీ మింగిన తర్వాత దాని పొట్ట ఉబ్బిపోవడంతో కదల్లేని పరిస్థితికి చేరుకుంది. దీంతో కోళ్లగూటిలోనే పడుకుని ఉండిపోయింది.
పామును గమనించిన ఇంటి యజమాని నరేష్ ఆందోళనకు గురై వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కిరణ్ అక్కడికి చేరుకుని జాగ్రత్తగా నాగుపామును పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించి విడిచిపెట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ ఘటనలో గుడ్లు పెట్టిన కోడి పాము కాటుకు చనిపోయినట్లు స్థానికులు చెప్పారు. ఒకేసారి 12 గుడ్లను మింగిన నాగుపాము ఆ తర్వాత కదల్లేని స్థితిలో కనిపించడంతో ఈ ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
