El Nino Effect
* గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ హై
El Nino Effect| ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ: వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్న సమయంలోనూ గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. సెప్టెంబరు చివరి రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వేడి ప్రభావంతో ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది.
రికార్డు స్థాయిలో డిమాండ్
సెప్టెంబరు 28న సాయంత్రం 6:42 గంటలకు గ్రేటర్ హైదరాబాద్‌లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 4,072 మెగావాట్లకు చేరినట్లు దక్షిణ డిస్కం అధికారులు తెలిపారు. అదే రోజు 82.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది.
2025 సెప్టెంబరు 28తో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగంలో భారీ పెరుగుదల కనిపించింది. గతేడాది అదే రోజున గరిష్ఠ డిమాండ్ 2,807 మెగావాట్లు కాగా, విద్యుత్ వినియోగం 55.34 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.
అక్టోబరులోనూ ఎండల ప్రభావం
అక్టోబరు 1న హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో వర్షాకాలం ముగిసే సమయంలోనూ నగర వాతావరణం వేసవిని తలపించింది. పగటి వేడి మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ ఉక్కపోత కొనసాగడం ప్రజలకు ఇబ్బందిగా మారింది.
ఎల్‌నినో ప్రభావం ఉందా?
పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రత మార్పులు రుతుపవనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎల్‌నినో పరిస్థితులు వర్షపాత సరళిలో మార్పులకు కారణమయ్యే పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి డాక్టర్ ఎఫ్.ఎస్. స్టెల్లా వివరించిన ప్రకారం.. సెప్టెంబరు చివరి దశలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉన్నప్పటికీ, ఈసారి వర్షపాతం అసమతుల్యత, మేఘావృత పరిస్థితుల్లో మార్పుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తేమలో మార్పులు కూడా ఉక్కపోతను పెంచుతున్నాయి.
వేసవి తరహాలో విద్యుత్ వినియోగం
సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ 4,000 మెగావాట్లకు పైగా నమోదవుతుంది. అయితే సెప్టెంబరులోనే 4,072 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవడం విద్యుత్ వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో సూచిస్తోంది. ఎండలు, ఉక్కపోత కారణంగా శీతలీకరణ పరికరాల వినియోగం పెరగడం దీనికి ప్రధాన కారణాల్లో ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
