Hanamkonda Rythu mela 2026
* రైతు మేళా–2026ను విజయవంతం చేయాలి
– జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర
ఆకేరు న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా కాళోజీ కళాక్షేత్రంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న జిల్లా స్థాయి రైతు మేళా–2026 (Rythu Mela 2026)ను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
* ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన
రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, అధిక దిగుబడులు సాధించే విధానాలపై అవగాహన కల్పించేందుకు రైతు మేళాను నిర్వహిస్తున్నట్లు విజయచంద్ర తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు, సాగులో ఎదురవుతున్న సవాళ్లపై నిపుణులతో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
* మట్టి పరీక్షలు.. సాయిల్ ప్రొఫైలింగ్
రైతు మేళాలో మట్టి పరీక్షలు, సాయిల్ ప్రొఫైలింగ్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వివిధ కార్యక్రమాలు, ఎరువులు–విత్తనాల వినియోగం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
* నిపుణుల సూచనలు, సలహాలు
వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు మేళాలో పాల్గొని రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.
* రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై సమగ్ర సమాచారం అందించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించేలా రైతులను ప్రోత్సహించడమే రైతు మేళా ప్రధాన ఉద్దేశ్యమని విజయచంద్ర తెలిపారు.
జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో రైతు మేళాకు హాజరై వ్యవసాయ నిపుణులు, అధికారుల సూచనలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
