Hasanparthy Woman Murder
* మిస్సింగ్ కేసులో హత్య వెలుగు
* బళ్లారిలో హత్య.. నిందితుడి అరెస్ట్
ఆకేరు న్యూస్, హసన్‌పర్తి: హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. సాంకేతిక ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. అదృశ్యమైన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బళ్లారికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
హసన్‌పర్తి పీఎస్ పరిధికి చెందిన తౌటం స్వప్న (40) ఈ ఏడాది మే 15 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి అమంచ రాజేందర్ మే 31న హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై బి. సుజిత్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేయగా స్వప్న హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.
* పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి
కర్ణాటకలోని బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన వోద్దిరాజుల బసవరాజ (27)తో స్వప్నకు పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని స్వప్న బసవరాజపై ఒత్తిడి తెచ్చినట్లు, లేదంటే తమకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయటపెడతానని చెప్పినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో పరువు పోతుందనే భయంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బళ్లారికి రప్పించినట్లు పేర్కొన్నారు.
* అడవిలో హత్య
బసవరాజ స్వప్నను బళ్లారిలోని గావి సిద్ధేశ్వర గుడి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పీక పిసికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరుసటి రోజు రాత్రి మట్టన్ కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేసినట్లు వెల్లడించారు. హత్య సమయంలో తనకు రక్తం అంటిన బట్టలను పెట్రోల్‌తో తగులబెట్టినట్లు, స్వప్న ఫోన్‌ను చెరువులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
* వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు
శుక్రవారం (సెప్టెంబర్ 11) అంబాల-కమలాపూర్ రోడ్డులో హసన్‌పర్తి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బసవరాజ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా స్వప్న హత్యకు సంబంధించిన విషయాలను అంగీకరించినట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి రియల్మీ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై BNS సెక్షన్ 103, 238 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
* పోలీసులకు అభినందనలు
కేసును చాకచక్యంగా ఛేదించిన హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ ఎ. మహేందర్, ఎస్సైలు సుజిత్, రవి, దేవేందర్, ఏఏఓ సల్మాన్ పాషా, పోలీస్ సిబ్బంది బావ్‌సింగ్, తిరుపతి, సుమన్, సోమన్న, పూర్ణచారి, నవీన్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
