* అధికారులు సెలవులు పెట్టొద్దు..
* ప్రజలకు అందుబాటులో ఉండాలి
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఆయా ప్రాంతాలకు మంత్రులు, అధికారులు వెళ్లాలని సూచించారు. ప్రజలకు అందిచాల్సిన సహాయక చర్యలను సత్వరమే చేపట్టాలని ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలను ఆయా జిల్లాల కలెక్టర్ లు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అదేవిధంగా చెరువులు, నదీ పరివాహక ప్రదేశాలలో ఉన్న ప్రాంతాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరద బాధితులకు నిత్యవసరాలు, ఆహారం వంటి సదుపాయాల్ని పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు.. జిల్లాల ముఖ్యఅధికారులు, సీఎస్ తో సమావేశం నిర్వహించారు. అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. అలాగే, ప్రజలకు కూడా అత్యవసర పనులుంటే తప్ప బయటకి రావొద్దని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలను సీఎం కోరారు.