Huzurabad Journalists
Huzurabad Journalists| ఆకేరు న్యూస్, హుజూరాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, కార్యదర్శి కామని రవీందర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా రంగ సమస్యలపై చర్చించేందుకు నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని, జర్నలిస్టుల చట్టబద్ధ హక్కులను పునరుద్ధరించాలని కోరారు. అలాగే వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం నూతన వేజ్ బోర్డు ప్రకటించాలని, నిలిపివేసిన రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూర్తిస్థాయి క్యాష్‌లెస్ ఆరోగ్య కార్డులు అందించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ నరేందర్‌కు అందజేశారు.
కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ, మండల పరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
