Huzurabad
ఆకేరు న్యూస్, హుజురాబాద్: హుజురాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వడిగే రాకేష్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేసుతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి వెల్లడించారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
హత్యకు ముందే పథకం
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. పాత కక్షలు, వివాహేతర సంబంధానికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ప్రధాన నిందితుడు అంబరగొండ ప్రశాంత్ రాకేష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గతంలో రాకేష్‌పై జరిగిన హత్యాయత్నం విఫలమైనప్పటికీ, ఈసారి మరింత పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
కెనాల్ వద్ద దారుణం
సెప్టెంబర్ 27 రాత్రి రాకేష్‌కు మద్యం తాగించి పెద్దపాపయ్యపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ కత్తులతో దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి నిందితులు వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఘటనపై మృతుడి తల్లి వడిగే దేవక్క ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 28న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నలుగురు అరెస్ట్
దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 1న అంబరగొండ ప్రశాంత్, రాజ్‌కుమార్, అమరగుండ రిత్విక్, తుమ్ముల అఖిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల ప్రక్రియను ఈ-సాక్ష్య ద్వారా వీడియో రికార్డు చేసినట్లు వెల్లడించారు.
మరో ఐదుగురి కోసం గాలింపు
కేసులో సంబంధం ఉన్న టి. అఖిల్, రాహుల్, చందు, అజయ్, గణేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఏసీపీ మాధవి పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
