Cyber Crime
Cyber Crime| ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లతో పాటు సైబర్ మోసాలకు వినియోగించేందుకు ఇతరుల బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుంటున్న ముఠా వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నెట్వర్క్
పోలీసుల వివరాల ప్రకారం.. పల్లపోలు వామనరెడ్డి (41) ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోయిన అనంతరం టెలిగ్రామ్‌లోని ‘జింట్రా’ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ గ్రూప్ ద్వారా మ్యూల్ ఖాతాల వ్యవస్థలోకి ప్రవేశించాడు. అనంతరం పలువురి నుంచి బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు, కిట్లు, కేవైసీ పత్రాలను సేకరించి వాటిని అక్రమ లావాదేవీలకు వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.
సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్లను ఉపయోగించి లావాదేవీలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. కొన్ని కరెంట్ ఖాతాలను నకిలీ వ్యాపార పత్రాలతో తెరిచినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
కమీషన్ కోసం ఖాతాలు
బ్యాంకు ఖాతాలను సమకూర్చినందుకు వామనరెడ్డి సుమారు 5 శాతం కమీషన్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల ఆధారంగా సంబంధిత ఖాతాదారులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించినట్లు పేర్కొన్నారు.
గత మూడు నెలలుగా వామనరెడ్డితో కలిసి పనిచేస్తున్న వాసగాని శ్రీనివాస్ అలియాస్ ప్రభాస్ (34) ఖాతాదారులను గుర్తించడం, బ్యాంకు కిట్లు, సిమ్ కార్డులు సేకరించడం వంటి పనుల్లో సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
23 ఖాతాల గుర్తింపు
అమాయకుల గుర్తింపు పత్రాలు, బ్యాంకు ఖాతాలను అద్దె ప్రాతిపదికన తీసుకుని వాటిని ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ మోసాలకు వినియోగిస్తున్న వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ కరీంగుల రాజు, ఎస్ఓటీ కానిస్టేబుళ్లు పి. శ్రీకాంత్, కె. ప్రభాకర్‌ల బృందం నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంది.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 14 మొబైల్ ఫోన్లలో 23 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
