Hyderabad Bonalu Celebrations
* ఉదయం నుంచీ సందడే సందడి
* నగరమంతటా ఆధ్యాత్మిక వాతావరణం
* కిక్కిరిసిన లాల్‌దర్వాజా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అమ్మలగన్న అమ్మరన్న.. పచ్చిపసుపు బొమ్మరన్న.. యాపచెట్టు కొమ్మరన్న.. ధూపమేసి దుమ్మురన్న.., అమ్మా బైలెల్లినాదిరన్న అంటూ భాగ్యనగరం పూనకాలతో ఊగిపోయింది. శివసత్తుల శివాలతో శివాలెత్తింది. డప్పుల చప్పుల్లు.. పోతరాజు విన్యాసాలతో మార్మోగిపోయింది. బోనాల పండుగ నేపథ్యంలో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివెరిసింది. ఎక్కడ చూసినా బోనాలతో తరలివెళ్లే మహిళలతో పసుపుమయంగా మారింది. ప్రధానంగా పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిణి ఆలయం వద్ద భక్తులు కిక్కిరిశారు.
* నగరవ్యాప్తంగా
లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయంతోపాటు నగరంలోని కాలనీలు, బస్తీల్లోని అమ్మవారి ఆలయాల వద్ద వద్ద కూడా భక్తులు బోనాలు సమర్పించేందుకు తరలివస్తున్నారు. సల్లంగా చూడమ్మా తల్లి అంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, చీర, సారె సమర్పిస్తున్నారు. భక్తితో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుడా ఆలయాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
* ప్రభుత్వం తరఫున..
లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ఎం, పీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పంపిన పట్టువస్త్రాలను టీడీపీ నాయకులు అమ్మవారికి అందజేశారు.
* అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, హైదరాబాద్ సీపీ సజ్జనార్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల విజయ లక్ష్మి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టాలివుడ్ హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, సింగర్ మంగ్లీ, దేవాదాయ శాఖ కమిషనర్, మెట్టు సాయి కుమార్, ఎమ్మెల్సీ, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ విభాగం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వి.హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
* బోనమెత్తిన కవిత
తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కల్వకుంట్ల కవిత లాల్‌దర్వాజ అమ్మవారికి ఆలయానికి బోనమెత్తుకుని వచ్చారు. సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించారు. చీర, సారె సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
