Mansha Hot Water Death
* వేడి నీళ్ల బకెట్లో పడి చిన్నారి మృతి
* హైదరాబాద్ మైలార్దేవ్ పల్లిలో విషాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో తల్లిదండ్రులను తీవ్ర గుండెకోతకు గురిచేసే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బకెట్‌లోని వేడి నీళ్లలో ప్రమాదవశాత్తూ పడి నాలుగేళ్ల చిన్నారి మానస ప్రాణాలు కోల్పోయింది.
* స్థానికులు.. పోలీసుల కథనం ప్రకారం..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ప్రగతి నగర్లో నివాసముంటోంది. పాప తల్లి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. మంగళవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమె, స్నానం చేయడం కోసం బకెట్లో వాటర్ హీటర్ పెట్టి నీళ్లను వేడి చేయడానికి ఉంచింది. అదే సమయంలో ఆమెకు అనుకోకుండా ఫోన్ కాల్ రావడంతో, బకెట్‌ను అలాగే ఉంచి మాట్లాడేందుకు బయటకు వెళ్లింది.
* పాపం.. ఆ చిన్నారికి తెలియక..
ఆ సమయంలో ఇంట్లోనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి మానస, గమనించకుండా వెళ్లి ప్రమాదవశాత్తూ వేడి నీళ్లతో నిండిన బకెట్లో పడిపోయింది. వేడికి గట్టిగా కేకలు వేసింది. పాప కేకలు విన్న తల్లి పరుగున వచ్చి చూసేసరికి చిన్నారి ఒంటిపై తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సాయంతో పాపను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, శరీర భాగాలన్నీ తీవ్రంగా కాలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చిన్నారి కన్నుమూసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నకూతురు కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
