Minister Sridhar Babu on Telangana Industrial Corridors
* 10 ఇండస్ట్రియల్ కారిడార్లు
* ₹5.86 లక్షల కోట్ల పెట్టుబడులు
* ఇండస్ట్రియల్ కారిడార్లపై ప్రభుత్వం దృష్టి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పారిశ్రామిక రంగ అభివృద్ధిపై పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పరిశ్రమలను అభివృద్ధి చేయడంతో పాటు 10 ఇండస్ట్రియల్ కారిడార్లు, సెక్టార్ స్పెసిఫిక్ పరిశ్రమలు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, గ్రీన్ ఫార్మా, నెట్ జీరో సిటీ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు.
* ₹5.86 లక్షల కోట్ల పెట్టుబడులు
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. దావోస్ 2025లో 26 MoUs ద్వారా ₹1.79 లక్షల కోట్ల, తెలంగాణ రైజింగ్ కార్యక్రమం ద్వారా 75 MoUsతో ₹3.82 లక్షల కోట్ల, దావోస్ 2026లో 7 MoUs ద్వారా ₹0.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. మొత్తంగా 108 MoUs ద్వారా ₹5.86 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు.
అయితే అన్ని MoUs వెంటనే భౌతికంగా అమలులోకి రావడం లేదని, కొన్ని కంపెనీలకు ఫైనాన్షియల్ క్లోజర్ వంటి అంశాలు కారణమవుతున్నాయని వివరించారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు.
* 10 ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు..
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై స్పందించిన మంత్రి.. తెలంగాణలో 10 ఇండస్ట్రియల్ కారిడార్లను, అలాగే ప్రాంతాలు, రంగాల ప్రత్యేకతలకు అనుగుణంగా సెక్టార్ స్పెసిఫిక్ పరిశ్రమలను అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎగుమతి ఆధారిత చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జహీరాబాద్, సంగారెడ్డి, జడ్చర్ల, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం వంటి ప్రాంతాలను ఇందుకు అనుకూలంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
* నల్లమలలో మెడిసినల్ ప్లాంట్స్..
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సూచించిన అంశాలపై మంత్రి స్పందిస్తూ.. రేర్, ప్యూర్ విభాగాల్లో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌తో పాటు తేనె, మైనం వంటి ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలకు కూడా అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. నల్లమల ప్రాంతంలో మెడిసినల్ ప్లాంట్స్, ఆయుర్వేదిక్ ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. ఇక్కిస్టంపేట్లోని 412 ఎకరాల భూమి అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
*ముంపు గ్రామాల మహిళలకు ఉపాధి..
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లేవనెత్తిన అంశాలపై మంత్రి మాట్లాడుతూ.. ముంపు గ్రామాల్లోని మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ అందించడంతో పాటు ఆధునిక షెడ్లను ఏర్పాటు చేసి చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
* రామగుండంలో అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం..
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రస్తావించిన అంశాలపై మంత్రి స్పందిస్తూ.. రామగుండంలో 1×800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. గతంలో BPL సంస్థకు కేటాయించిన 1,800 ఎకరాల భూమి కోర్టు వివాదాల్లో ఉందని, సమస్య పరిష్కారానికి సంబంధిత వ్యక్తులతో చర్చించి భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రామగుండం ప్రాంతంలో ఎరువుల కర్మాగారం, సింగరేణి, NTPC వంటి సంస్థలకు అనుబంధంగా Ancillary పరిశ్రమలను తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతామని మంత్రి తెలిపారు.
* షాద్‌నగర్, సిద్ధాపూర్లో పరిశ్రమలపై దృష్టి..
షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ ప్రస్తావించిన బిందు సారియా సంస్థ ప్రత్యేక ఇన్సెంటివ్‌ల అంశాన్ని క్యాబినెట్ సబ్‌కమిటీకి పంపినట్లు మంత్రి తెలిపారు. కమిటీ నిర్ణయం అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సిద్ధాపూర్‌లోని 330 ఎకరాల్లో కాలుష్య రహిత చిన్నతరహా పరిశ్రమలు, ఐటీ పార్క్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. డాక్టర్ భూపతిరెడ్డి సూచించిన గొండారం, ఖానాపూర్ ప్రాంతాల్లో రైల్వే సైడింగ్, గోదాముల వంటి సదుపాయాలు ఉన్నందున లాజిస్టిక్స్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్, పసుపు ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించే అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.
* షాబాద్ స్టోన్‌కు వాల్యూ అడిషన్..
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లేవనెత్తిన అంశంపై స్పందిస్తూ.. షాబాద్ స్టోన్ క్వారీల ఆధారిత పరిశ్రమలకు వాల్యూ అడిషన్ కల్పించి మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
* ఫ్యూచర్ సిటీపై కీలక వ్యాఖ్యలు..
GMR మధుసూదన్ రెడ్డి, మల్లారెడ్డి రంగారెడ్డి లేవనెత్తిన డ్రై పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ అంశాలను పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీని కాలుష్య రహితంగా ‘నెట్ జీరో సిటీ’గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రీన్ ఫార్మాకు ప్రాధాన్యం ఇస్తామని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అంతర్జాతీయ స్థాయి నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. విజయవాడ వైపు, వరంగల్ వైపు సహా మరో నాలుగైదు ప్రాంతాల్లో సెక్టార్ స్పెసిఫిక్ పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
* మక్తల్‌లో నీటి ఆధారిత పరిశ్రమలకు అవకాశం..
మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి సూచించిన కృష్ణా మండలంలోని 450 ఎకరాల భూమిలో రాయచూర్ తరహాలో నీటి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, ఆంధ్రప్రదేశ్‌లోని సంబంధిత ప్రాంతాలను కలుపుకొని డిఫెన్స్ కారిడార్‌గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని వెల్లడించారు.
మొత్తంగా, తెలంగాణలో ప్రాంతాల ప్రత్యేకతలు, వనరులు, రవాణా సదుపాయాలను ఆధారంగా చేసుకుని పరిశ్రమలను విస్తరించడంతో పాటు MSMEలు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, గ్రీన్ ఫార్మా, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
