Dead Drop Drug Network
* డ్రగ్స్ డెలివరీలో కొత్త ట్విస్టులు..!
* మనిషి కనిపించకుండానే సరుకు అందజేత
* తెరపైకి డెడ్ డ్రాప్ వ్యూహం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : ఈగల్, ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నాయి. అన్ని మార్గాల్లోనూ నిఘా పెట్టి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నాయి. మరోవైపు స్మగర్లు.. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కొత్తకొత్త మార్గాల ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు. సినిమాలను తలపించే విధంగా పోలీసులకు ట్విస్టులు ఇస్తున్నారు. డ్రగ్స్ దందాలో స్మగ్లర్లు వాడే టెక్నిక్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. దీనిపై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
* ఎవరు ఇచ్చారు?
డ్రగ్ స్మగర్లు నేరుగా కస్టమర్‌ను కలవరు.. ఫోన్లో మాట్లాడరు.. ఎక్కడా ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.. వినియోగదారులు కేవలం లొకేషన్ షేర్ చేస్తే చాలు.. క్షణాల్లో మత్తు పదార్థం వారి చేతికి అందిపోతుంది. వారికి కూడా ఎవరు అమ్మారో తెలియదు. తెచ్చి ఇచ్చిన వారి ముఖమూ కనిపించదు. విదేశీ మూలాలున్న ఈ సరికొత్త డ్రగ్స్ రాకెట్ ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు సవాల్‌గా మారుతోంది.
* బెంగళూరు నుంచి నెట్వర్క్..
నైజీరియాకు చెందిన ఘరానా డ్రగ్స్ స్మగ్లర్లు కొందరు కొన్నేళ్లుగా బెంగళూరు కేంద్రంగా అక్రమ దందా సాగిస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. అలాంటి కోవకు చెందిన వారే మైకెల్ జాన్సన్ అలియాస్ హానర్, కుర్బా. వీరు నగరానికి చెందిన హనీన్, మోహిత్ కుమార్ వంటి స్థానిక పరిచయాలను కలుపుకొని ఒక పటిష్టమైన, గుట్టుచప్పుడు కాని నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల నిఘా కన్ను నుంచి తప్పించుకోవడానికి వీరు ఎంచుకున్న మార్గమే ‘డెడ్ డ్రాప్’
* దందా చేసేది ఇలా..
మాదకద్రవ్యాలు కావాల్సిన కస్టమర్లు నేరుగా స్మగ్లర్లను సంప్రదించరు. స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ యాప్స్ ద్వారానే ఆర్డర్లు పెడతారు. మ్యూల్ అకౌంట్లలోకి మనీ: డ్రగ్స్‌కు సంబంధించిన డబ్బును కస్టమర్లు నేరుగా నగదు రూపంలో ఇవ్వరు. క్యూఆర్ కోడ్ లేదా ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా నకిలీ చిరునామాలతో సృష్టించిన ‘మ్యూల్’ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు.
* లోకేషన్.. షెడ్యూల్ చెబితే చాలు..
డబ్బులు ఖాతాలో జమ కాగానే స్మగ్లర్ల అసలు ఆట మొదలవుతుంది. కస్టమర్ ఉన్న ప్రాంతానికి సమీపంలోని రోడ్డు డివైడర్లు, నిర్మానుష్య ప్రదేశాలు, చెట్ల పొదలు లేదా అపార్ట్మెంట్ కార్నర్లలో డ్రగ్స్ ప్యాకెట్‌ను పడేస్తారు. ఆ ప్రాంతాన్ని చిన్న వీడియో లేదా ఫొటో తీసి, సరిగ్గా ఆ ‘లొకేషన్’ను కస్టమర్‌కు వాట్సాప్ లేదా స్నాప్‌చాట్‌లో షేర్ చేస్తారు. కస్టమర్ వెళ్లి ఆ ప్యాకెట్‌ను తీసుకుని సైలెంట్‌గా జారుకుంటారు.
* తీగ లాగడంతో..
ఈ సరికొత్త మోసాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఈగల్ పోలీసులు, బెంగళూరు కేంద్రంగా నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను ఇటీవల పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 241 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా ఈ ముఠా గతంలోనూ ఇదే తరహాలో హైదరాబాద్‌లోని పలువురు యువతకు, కస్టమర్లకు భారీగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తీగలాగడంతో కొత్త వ్యూహం వెలుగులోకి వచ్చింది. టెక్నాలజీని నేరానికి అడ్డుపెట్టుకుని పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఈ నైజీరియన్ స్మగ్లర్ల వ్యూహం ఇప్పుడు కలకలం రేపుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
