Minister Sridhar Babu on Telangana IT Jobs
* లక్ష ఉద్యోగాలు.. రూ.70 వేల కోట్ల పెట్టుబడులు
* టియర్-2 నగరాలకు ఐటీ వెలుగులు
* అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు స్పష్టత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ, పారిశ్రామిక రంగాలు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభ వేదికగా వెల్లడించారు. శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ ఒప్పందాలు మరియు ఉపాధి అవకాశాలపై మంత్రి పాయింట్ టు పాయింట్ వివరాలను సభకు సమర్పించారు.
* ఐటీ టవర్ల పనితీరుపై సమీక్ష..
గతంలో నిర్మించిన ఐటీ టవర్లు కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మిగిలిపోయాయా లేదా నిజంగానే యువతకు ఉద్యోగాలు కల్పించాయా అనే అంశంపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఐటీ టవర్లు విజయవంతం కావాలంటే కేవలం భవన నిర్మాణాలు మాత్రమే సరిపోవని, హెచ్‌సీఎల్ (HCL) వంటి గ్లోబల్ యాంకర్ పార్టనర్లు ముందుకు రావాలని స్పష్టం చేశారు. పారిశ్రామిక దిగ్గజాలు కోరుకునే ఫైవ్ స్టార్ హోటళ్లు, నాణ్యమైన పాఠశాలలు, అత్యాధునిక ఆసుపత్రులు వంటి “సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్” అభివృద్ధిపై కూడా దృష్టి సారించామని వివరించారు.
* టియర్-2 నగరాలకు ఐటీ సంక్షేమం
వరంగల్ నుంచి ఆదిలాబాద్ వరకు ట్రాఫిక్, జనసాంద్రత పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా టియర్-2 నగరాలకు విస్తరిస్తున్నామని తెలిపారు.
ఆదిలాబాద్: బార్ కంబల్ వద్ద నిర్మాణం పూర్తయిన ఐటీ టవర్‌ను రాబోయే వారంలో శాసనసభ స్పీకర్ గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
నిజామాబాద్: ఇక్కడ ఉన్న 881 సీట్ల సామర్థ్యంలో ఇప్పటికే 15 కంపెనీల ద్వారా 338 మందికి ఉద్యోగాలు లభించాయని, మిగిలిన సీట్లలో కొత్త కంపెనీలను తెచ్చేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశామని వెల్లడించారు. వికారాబాద్ & ఇతర ప్రాంతాలు వికారాబాద్‌లో ఐటీ సెంటర్ స్థాపనకు స్థానిక యాంకర్ పార్టనర్లు ముందుకు వస్తే భూమితో పాటు సబ్సిడీలు, ఇన్సెంటివ్‌లు ఇస్తామని ఆఫర్ చేశారు. పెద్దపల్లి, గోదావరిఖని, షాద్‌నగర్ (సిద్దాపూర్) ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
* పెట్టుబడుల ఒప్పందాలు (MoUs)..
విదేశీ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం మైలురాళ్లను సాధించిందని మంత్రి తెలిపారు. విశ్వవ్యాప్త భాగస్వామ్యాలు దావోస్, ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సమిట్లు, బయో ఆసియా, మరియు రోడ్ షోల ద్వారా పారిశ్రామిక వేత్తలతో విస్తృత చర్చలు జరిపాం. 108 కొత్త ఒప్పందాలు: 2025-26 సంవత్సరానికి గాను ఐటీ, డేటా సెంటర్లు, ప్రాథమిక పరిశ్రమల విభాగాల్లో మొత్తం 108 ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నాం.
తెలంగాణ రైజింగ్ సమిట్ : సమిట్‌లో కుదిరిన 75 ఒప్పందాల్లో 17 ప్రాజెక్టులు (దాదాపు 23శాతం MoUs) ఇప్పటికే భూ కేటాయింపులతో గ్రౌండ్ అయి, ఆపరేషన్ లోకి వచ్చాయి. దావోస్ సమిట్ పురోగతి: గత, ఈ సంవత్సరాల దావోస్ ఒప్పందాల్లో 45% కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కాయి (గ్రౌండెడ్ అయ్యాయి). ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్: నోడల్ అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, అత్యున్నత స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఎస్కలేషన్ మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు.
* ఏడాదిలో 75 GCCలు.. లక్ష ఉద్యోగాలు..
ప్రభుత్వం అందిస్తున్న ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) సదుపాయాలు, మెరుగైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల గత ఒకే ఏడాదిలో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. గత రెండేళ్ల కాలంలో దాదాపు ఒక లక్ష కొత్త ఐటీ ఉద్యోగాలు సృష్టించబడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తు కోసం నూతన ‘GCC పాలసీ’ని రూపొందించేందుకు బిగ్-4 (Big Four) కన్సల్టింగ్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
* డేటా సెంటర్లు – రూ. 70వేల కోట్ల పెట్టుబడి..
టీసీఎస్ (TCS) హైపర్ వాల్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా రూ. 70,000 కోట్ల పెట్టుబడితో భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తెలంగాణకు వస్తోందని మంత్రి ప్రకటించారు. విద్యుత్, నీటి వినియోగంపై స్పష్టత: డేటా సెంటర్లకు అధిక పరిమాణంలో నీరు, విద్యుత్ అవసరమవుతాయని, అయితే రాష్ట్రంలోని గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి ఎలాంటి కరెంట్ కొరత లేకుండా పూర్తి స్థాయిలో సరఫరా చేసిన తర్వాతే డేటా సెంటర్ల అదనపు విద్యుత్ అవసరాలకు అనుమతినిస్తామని తెగేసి చెప్పారు.
* ఆర్ఆర్ఆర్ కనెక్టివిటీ & ఏఐ (AI) సవాళ్లు..
ఆర్ఆర్ఆర్ పూర్తయితే నిజామాబాద్ వంటి నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ పెరిగి ప్రయాణ సమయం తగ్గుతుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. ఏఐ రాకతో గ్లోబల్ ఐటీ మార్కెట్లో వస్తున్న మార్పులను గమనిస్తున్నామని, సాంకేతికతకు అనుగుణంగా తెలంగాణ యువతకు ‘హై-వాల్యూ’ ఉద్యోగాలు లభించేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. మంత్రి తన ప్రసంగం ముగింపులో, ఐటీ మరియు పారిశ్రామిక రంగానికి చెందిన పూర్తి వివరాలు, ఒప్పందాల సమగ్ర డేటాను అసెంబ్లీ రికార్డులకు అందజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
