* రాంనగర్ నుంచి హిమాయత్‌సాగర్ వైపు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువు పరిధిలో ఉన్నా, నాలాపై ఉన్నా రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది. తాజాగా రాంనగర్(Ramnagar)లోని మణెమ్మకాలనీలో నాలాలపై నిర్మించిన నిర్మాణాలను ధ్వంసం చేసింది. మూడు ప్రత్యేక బృందాలుగా దాదాపు 70 మంది డీఆర్ఎస్ హైడ్రా(Hydra) కూల్చివేత ప్రత్యేక సిబ్బంది వచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. 1-9-18/9 సర్వే నంబర్ గల స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా రోడ్డును కబ్జా చేసి, ఆ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కొన్ని కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hyra commisnor Ranganath)పరిశీలించారు. వీటిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులను రంగనాథ్ ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధరించిన అనంతరం హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఫిర్యాదు ఇచ్చిన రెండ్రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా వరద నీరు వెళ్లేందుకు మార్గం మూసుకోవడంతో ఏటా వర్షా కాలంలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడం, ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికంగా పలు ఇబ్బందులు గురవుతున్నామని అనేక పర్యాయాలు సంబంధిత అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు చేపట్టలేదు. ఇక తాజాగా హైడ్రా చర్యలతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, హిమాయత్‌సాగర్(Himayathsagar) అక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది. వారంలో సాగర్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశాయి. జలమండలి, రెవెన్యూ అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. మొదట దశలో భాగంగా కొందరు ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలు ఇందులో ఉన్నట్టు తేలింది.
Related Stories
December 4, 2024
December 4, 2024
December 3, 2024