India W and Australia W T20 WorldCup
* 170 పరుగులు చేసినా లాభం లేకపోయింది..
* టీమిండియా వరల్డ్‌కప్ కల మరోసారి చెదిరింది!
ఆకేరు న్యూస్, డెస్క్:
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బ్యాటింగ్‌లో 170 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు భారత జట్టును టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేశాయి.
ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
* హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీ.. భారీ స్కోరు చేసిన భారత్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి చెలరేగింది. ముఖ్యంగా చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించింది.
ఆమెకు తోడుగా స్మృతి మంధాన 38 పరుగులు, షఫాలీ వర్మ 34 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేయడంతో భారత్ పోరాడే లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచగలిగింది.
* మ్యాచ్‌ను మలుపు తిప్పిన గార్డ్నర్, పెర్రీ
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ఆరంభంలో కట్టడి చేశారు. ఒక దశలో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లో ఉన్నట్లే కనిపించింది. అయితే యాష్ గార్డ్నర్ క్రీజులోకి వచ్చిన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
గార్డ్నర్ కేవలం 29 బంతుల్లో 53 పరుగులు చేసి మ్యాచ్‌ను ఆసీస్ వైపు తిప్పేసింది. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో ఎలిసా పెర్రీ అద్భుతంగా ఆడి 38 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఈ ఇద్దరూ కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడి చేసి విజయాన్ని అందించారు.
* కొంపముంచిన ఫీల్డింగ్.. చేతులెత్తేసిన బౌలర్లు
కీలక సమయంలో భారత జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. నోబాల్స్, మిస్ ఫీల్డ్స్, కీలక సమయంలో పరుగులను నియంత్రించడంలో విఫలమవడం మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాయి. క్యాచ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం కూడా భారత్‌కు భారీ మూల్యం చెల్లించింది.
దాంతో మరో ఆరు బంతులు మిగిలుండగానే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
* మరోసారి నెరవేరని ప్రపంచకప్ కల
గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశకు చేరువలోకి వెళ్లి వెనుదిరుగుతున్న భారత మహిళల జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది.
బ్యాటింగ్‌లో పోరాడినా.. కీలక సమయాల్లో బౌలింగ్, ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు టీమిండియా వరల్డ్‌కప్ కలను చెదరగొట్టాయి.
ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడనుండగా.. మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
