India w vs Australia w Semi Final
* ఓడినా సెమీస్ చేరే ఛాన్స్ ఉందా? లెక్కలు ఇవే!
ఆకేరు న్యూస్, డెస్క్:
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టుకు అసలైన పరీక్ష ఎదురైంది. ఆదివారం లండన్ వేదికగా ఆరు సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తలపడనుంది.
ఈ మ్యాచ్ భారత్‌కు వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా మారింది. గెలిస్తే నేరుగా సెమీస్.. ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* పాయింట్ల పట్టికలో పరిస్థితి ఇదే..
ప్రస్తుతం గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో 6 పాయింట్లతో ఉన్నప్పటికీ.. మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ 4 పాయింట్లతో పోటీలో ఉన్నా.. సెమీస్ అవకాశాలు చాలా క్లిష్టంగా కనిపిస్తున్నాయి.
* భారత్ గెలిస్తే లెక్కలు అవసరం లేదు..
ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధిస్తే.. దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంతో ఎలాంటి సంబంధం లేకుండా సెమీఫైనల్‌కు చేరుతుంది. అంతేకాదు, భారీ తేడాతో గెలిస్తే గ్రూప్ టాపర్‌గా కూడా నిలిచే అవకాశం ఉంది.
* ఓడినా సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉందా?
అవును.. ఒక ప్రత్యేక పరిస్థితిలో భారత్‌కు ఆ అవకాశం ఉంది.
భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి, మరోవైపు బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికాను ఓడిస్తే.. భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లకు తలా 6 పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్‌రేట్ (+2.268) మిగిలిన జట్ల కంటే మెరుగ్గా ఉండటంతో.. సెమీస్ బెర్త్ దక్కే అవకాశం ఉంటుంది.
* భారత్‌ను కలవరపెడుతున్న అంశాలివే..
టోర్నీలో స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు మంచి ఫామ్‌లో కనిపిస్తున్నా.. మిడిల్ ఆర్డర్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు రావాల్సి ఉంది.
ఫీల్డింగ్ కూడా భారత జట్టుకు పెద్ద సమస్యగా మారింది. గత రెండు మ్యాచ్‌ల్లో పలు సులభ క్యాచ్‌లను వదిలేయడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై ఇలాంటి తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
* బౌలింగ్‌లో శ్రీ చరణిపై ఆశలు..
ఎడమచేతి స్పిన్నర్ శ్రీ చరణి ఈ ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రధాన బలంగా నిలిచింది. ఇప్పటికే 12 వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో ఉన్న ఆమెపై మరోసారి జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
* ఆసీస్ మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంలో..
ఇప్పటికే సెమీస్‌కు దాదాపు చేరిన ఆస్ట్రేలియా ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతోంది. గాయంతో దూరమైన స్టార్ ప్లేయర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ తిరిగి జట్టులో చేరడం కంగారూలకు అదనపు బలం చేకూర్చింది.
భారత్‌కు ఈ మ్యాచ్ కేవలం మరో లీగ్ మ్యాచ్ కాదు.. సెమీఫైనల్ కలను నిలబెట్టుకునే కీలక పోరు. గెలిస్తే చరిత్ర దిశగా మరో అడుగు.. ఓడితే బంగ్లాదేశ్‌పై ఆశలు పెట్టుకోవాల్సిందే.
