Indira Shobhan Konda Susmitha
* కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య మాటల యుద్ధం రాజకీయంగా తీవ్ర వేడిని రాజేస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు కొండా సుష్మిత, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరియు పార్టీ నిర్ణయాలను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. కొండా సుష్మిత మాట్లాడిన మాటలను ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ శ్రేణులపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ చేస్తుండటంతో, కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ గాంధీ భవన్ వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు.
* 15 ఏళ్లగా కష్టపడిన మాకే రాలేదు
సుష్మిత వైఖరిపై ధ్వజమెత్తు
ఇందిరా శోభన్ మాట్లాడుతూ కొండా సుష్మిత బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. “గత 15 సంవత్సరాల నుంచి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీ జెండాను భుజాన ఎత్తుకుని, రాత్రింబవళ్లు శ్రమించిన ఎంతో మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. దశాబ్ద కాలానికి పైగా పార్టీ కోసం దొబ్బించుకున్న మాకే ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సుష్మిత అప్పుడే పదవులు, టికెట్ల కోసం మాట్లాడటం, సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం హాస్యాస్పదం” అని మండిపడ్డారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల పక్క పార్టీల వాళ్లు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ట్రోల్ చేసే అవకాశం చిక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.
* దమ్ముంటే రేవంత్ రెడ్డి అవినీతిపై ఆధారాలు బయటపెట్టు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన అవినీతి ఆరోపణలకు ఇందిరా శోభన్ నేరుగా సవాల్ విసిరారు. “ధైర్యముంటే, దమ్ముంటే రేవంత్ రెడ్డి అవినీతిపై నీ దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టు” అని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఊహాజనిత ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని హెచ్చరించారు. నిజంగానే ఆధారాలు ఉంటే వాటిని చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థల ముందు లేదా మీడియా ముందు ఉంచాలే తప్ప గాల్లో మాటలు మాట్లాడకూడదని అన్నారు.
* మీ అమ్మ తల దించుకునేలా ప్రవర్తించవద్దు
సుష్మిత కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఇందిరా శోభన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నారని, కానీ సుష్మిత చేస్తున్న విచక్షణారహిత వ్యాఖ్యల వల్ల ఆమె తల్లి సొంత పార్టీలో, సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. సినిమాల్లో చూసిన డైలాగులు రాజకీయాల్లో కొడితే నడవదని, సుష్మిత వైఖరి ఆమె తల్లిదండ్రుల పెంపకానికే మచ్చ తెచ్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
* బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలో పావుగా సుష్మిత
ఈ వివాదం వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందనే అనుమానాన్ని ఇందిరా శోభన్ వ్యక్తం చేశారు. “బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నీతో మాట్లాడిస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్రలో నువ్వు పావుగా మారావు” అని ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, అధిష్ఠానం ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న సుష్మితపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
