YSRCP chief YS Jagan
* బలమైన అభ్యర్థుల ఎంపికపై ఫోకస్
ఆకేరు న్యూస్, తాడేపల్లి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్రెడ్డి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో (రీజినల్ కో-ఆర్డినేటర్లు) తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
* బలమైన అభ్యర్థుల ఎంపికే లక్ష్యం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబెట్టే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అత్యంత వేగవంతం చేయాలని జగన్ రీజినల్ కో-ఆర్డినేటర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మంచి పేరు, ప్రజాదరణ ఉన్న బలమైన నేతలను బరిలోకి దించాలని స్పష్టం చేశారు.
ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, ఎంపిక చేసే అభ్యర్థులు రేపు రాబోయే సాధారణ ఎన్నికలకు బలమైన పునాదిగా మారాలి అని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో అందరి అభిప్రాయాలను సేకరించి, పలు దఫాలుగా చర్చించిన అనంతరమే జాబితాలను ఆమోదించాలని, స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్టీని ఒక్కతాటిపైకి తీసుకురావాలని సూచించారు.
* గడప గడపకూ కూటమి వెన్నుపోట్లు
రెండున్నరేళ్ల కూటమి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన వెన్నుపోట్లు, హామీల ఉల్లంఘనలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రతి గడపకూ వెళ్లి వైయస్సార్సీపీ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రస్తుత పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలను స్పష్టంగా వివరించాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.
* అడ్డదారులను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, పోలీసు బలంతో అడ్డదారుల్లో గెలిచేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నుతుందని జగన్ ఆరోపించారు. కూటమి బెదిరింపులు, కుట్రలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ప్రణాళికలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఈ కీలక సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
