Kadiyam Srihari
*ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు : కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరా నగర్ లో ఒక్క గుడిసె ఉండడానికి వీలు లేదని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని ఇందిరానగర్‌లో గుడిసెలు, కవర్లు కప్పి ఉన్న ఇళ్లు లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత నాదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.
ఇందిరానగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన వంట గది, మున్సిపల్ నిధులు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ కాల్వలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్థానికుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నానని చెప్పారు.
గతంలో ఇందిరానగర్ మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తన దృష్టికి తీసుకురాగా, వెంటనే దానిని అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు. ఇందిరానగర్‌లో అంతర్గత రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసం చర్యలు చేపట్టినట్లు, ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో అత్యధికంగా సీసీ రోడ్లు నిర్మించిన ప్రాంతాల్లో ఇందిరానగర్ కూడా ఉందన్నారు. సీసీ రోడ్లతో పాటు సైడ్ డ్రైన్ల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు.
ఇందిరానగర్‌లో ఎక్కువగా పేద కుటుంబాలు నివసిస్తున్నందున అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కడియం శ్రీహరి అన్నారు. గతంలో ఏడు ఇళ్లు మంజూరు కాగా ఐదు ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయని, మిగిలిన కుటుంబాలకు కూడా ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇందిరానగర్‌లో ఇంకా గుడిసెలు లేదా కవర్లతో ఉన్న ఇళ్లు ఎన్ని ఉన్నాయో మున్సిపల్ అధికారులు సర్వే చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైతే 10, 15 ఇళ్లు అయినా మంజూరు చేయించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందిరానగర్‌లోని అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
స్టేషన్ ఘనపూర్, చాగల్లు, శివునిపల్లి గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్లు కడియం శ్రీహరి తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు 2025 జనవరిలో ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. మున్సిపాలిటీ చేయడమే కాదు మున్సిపాలిటీ అభివృద్ధికి సుమారు రూ.50 కోట్ల నిధులు కేటాయింపుతో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మరో రూ.8 కోట్ల అదనపు నిధులు వచ్చాయని తెలిపారు.
మొత్తంగా రూ.60 కోట్లతో మౌలిక వసతుల పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే రూ.15,16 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. 10, 18వ వార్డుల్లో సుమారు రూ.కోటి రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం పూర్తయిందని, వాటిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా 26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.
డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ
తెలంగాణలో ఇలాంటి రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్‌లలో ఇది రెండోదని పేర్కొన్నారు. స్టేషన్ ఘన్ పూర్ “డిగ్రీ కళాశాలకు భూమి పూజ” గత ఎడాది ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరైందని, ప్రస్తుతం రెండో సంవత్సరం అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయని కడియం శ్రీహరి తెలిపారు. కళాశాల భవన నిర్మాణానికి సుమారు రూ.6.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఐదు ఎకరాల భూమిని డిగ్రీ కాలేజీకి బదలాయించారని, భవన నిర్మాణానికి ఈ రోజే భూమిపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.1600 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు కడియం శ్రీహరి తెలిపారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల కింద హ్యామ్ పథకం ద్వారా రోడ్ల అభివృద్ధికి నియోజకవర్గానికి మాత్రమే సుమారు రూ.470 కోట్ల నిధులు వచ్చాయని పేర్కొన్నారు. హ్యామ్ రోడ్ల పనులు కూడా దసరా అనంతరం ప్రారంభమవుతాయని చెప్పారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, మున్సిపల్ కమిషనర్ రాధక్రిష్ణ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, మున్సిపల్ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్ బత్తిని చంద్రమౌళి ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
