Kaleshwaram Saraswati Pushkaralu 2026
* 40 లక్షల మంది భక్తులు
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది ‘అంత్య పుష్కరాలు’ నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోంది. బృహస్పతి మిథున రాశి నుంచి నిష్క్రమిస్తున్న వేళ, ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కర వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. దేవాదాయ శాఖ తొలిసారిగా అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తుండటంతో భక్తులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత పుష్కరాలకు 30 లక్షల మంది రాగా, ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
* రూ. 21.98 కోట్ల నిధుల మంజూరు – శాఖల వారీగా కేటాయింపులు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం రూ. 21.98 కోట్ల భారీ బడ్జెట్తో వివిధ అభివృద్ధి పనులను చేపట్టింది. పనులను వేగవంతం చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా డిపిఓ (DPO) విభాగానికి రూ. 97.42 లక్షలు, దేవాదాయ శాఖకు రూ. 67.42 లక్షలు, నీటిపారుదల శాఖకు రూ. 62.20 లక్షలు, ఆర్ అండ్ బి (R&B) కి రూ. 51 లక్షలు, పంచాయతీ రాజ్ శాఖకు రూ. 34.80 లక్షలు మరియు ఆర్టీసీ (RTC) కి రూ. 17 లక్షల నిధులను మంజూరు చేస్తూ పనులను వేగవంతం చేశారు.
* రూ. 1.20 కోట్లతో ప్రతిష్టాత్మక మ్యూజియం…
పుష్కరాల వేళ కాళేశ్వరానికి వచ్చే భక్తులకు మరో ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. కాకతీయుల కాలం నాటి అరుదైన, పురాతన విగ్రహాలను మరియు శిల్ప సంపదను భద్రపరిచేందుకు దేవాదాయ శాఖ రూ. 1.20 కోట్లతో ఒక ప్రతిష్టాత్మక మ్యూజియంను నిర్మిస్తోంది. భక్తులు, సందర్శకులు ఈ చారిత్రక కళాఖండాలను ఒకే చోట వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సరస్వతీ నది పుష్కరాల నాటికే ఈ మ్యూజియం పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుని రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.
* భక్తులకు ప్రత్యేక రక్షణ..
పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రక్షణ కోసం గజ ఈతగాళ్లను, ప్రత్యేక రక్షణ సిబ్బందిని నియమిస్తున్నారు. పారిశుధ్య పనులు, తాగునీటి వసతి మరియు రవాణా సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు లేకుండా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
