Kaleshwaram Pushkaralu Schedule
ఆకేరు న్యూస్, కాళేశ్వరం:
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, త్రివేణి సంగమ స్థానమైన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మే 21, 2026 (ఈరోజు) నుండి జూన్ 1, 2026 వరకు 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కర వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సరస్వతి పుష్కర ఘాట్ వద్ద ప్రతిరోజూ ప్రత్యేక పుష్కర హోమాలు, ప్రముఖ పీఠాధిపతులచే పుష్కర స్నానాలు, సాయంత్రం వేళల్లో కనులపండువగా నదీ హారతి, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది.
ఈ 12 రోజుల పాటు భక్తుల సకల విఘ్నాలు తొలగడానికి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్య ప్రాప్తి కోసం దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చే ప్రముఖ పీఠాధిపతులు, స్వామీజీల సమక్షంలో విశేష హోమాలు నిర్వహించనున్నారు.
* 12 రోజుల పుష్కర పూజా కార్యక్రమాల పూర్తి షెడ్యూల్
మొదటి రోజు (21 మే 2026): మహా గణపతి హోమం (సకల విఘ్న నివారణార్థం)
హాజరయ్యే పీఠాధిపతులు శ్రీ జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి, కంచి.
రెండవ రోజు (22 మే 2026): సుబ్రహ్మణ్య షడాక్షరీ హోమం (సంతాన ప్రాప్తి, శత్రుబాధ నివృత్యార్థం) హాజరయ్యే పీఠాధిపతులు మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతీ మహారాజ్, నాశిక్.
మూడవ రోజు (23 మే 2026): హయగ్రీవ హోమం (సకల విద్యా ప్రాప్త్యర్థం)
హాజరయ్యే పీఠాధిపతులు ప్రముఖ పండితులు, వేద అర్చకులు.
నాల్గవ రోజు (24 మే 2026): మహా మృత్యుంజయ హోమం (అపమృత్యు దోష నివారణార్థం)
హాజరయ్యే పీఠాధిపతులు: శ్రీ యోగానంద సరస్వతీ స్వామీజీ, ఆదిలాబాద్.
ఐదవ రోజు (25 మే 2026): నవగ్రహ హోమం (నవగ్రహ ప్రసాద సిద్ద్యార్థం)
హాజరయ్యే పీఠాధిపతులు శ్రీ అద్వైతానంద భారతీ పీఠాధిపతి, శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం.
ఆరవ రోజు (26 మే 2026): దుర్గా సూక్త హోమం (సకల ఐశ్వర్య ప్రాప్త్యర్థం)
హాజరయ్యే పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామి, హంపి.
ఏడవ రోజు (27 మే 2026): మహా సుదర్శన హోమం (సకల దృష్టి దోష నివృత్యార్థం) హాజరయ్యే పీఠాధిపతులు శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గิరి మహారాజ్, పీఠాధిపతి, శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం, బర్దీపూర్.
ఎనిమిదవ రోజు (28 మే 2026): మేధా దక్షిణామూర్తి హోమం (మేధా ధారణ సిద్ద్యార్థం)
హాజరయ్యే పీఠాధిపతులు శ్రీ శివానంద భారతి చింతామణి స్వామి, చింతామణి మఠం, అమరావతి, హోస్పేట, విజయనగర జిల్లా, కర్ణాటక.
తొమ్మిదవ రోజు (29 మే 2026): స్వయంవర పార్వతి హోమం (శీఘ్ర వివాహ ప్రాప్త్యర్థం)
హాజరయ్యే పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి & శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, శారదా పీఠం, విశాఖపట్నం.
పదవ రోజు (30 మే 2026): ధన్వంతరి హోమం (ఆయుః ఆరోగ్య ప్రాప్త్యర్థం)
హాజరయ్యే పీఠాధిపతులు ప్రముఖ పీఠాధిపతులు, వేద పండితులు.
పదకొండవ రోజు (31 మే 2026): మహా రుద్ర హోమం (అష్ట ఐశ్వర్య ప్రాప్త్యర్థం)
హాజరయ్యే పీఠాధిపతులు శ్రీ మాధవానంద సరస్వతీ, కొల్చారం, మెదక్.
పన్నెండవ రోజు (1 జూన్ 2026): లఘు చండీ హోమం (సకల పాపక్షయార్థం) – ముగింపు వేడుకలు.
* ప్రత్యేక ఆకర్షణగా…
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఘాట్ల వద్ద అన్ని రకాల మౌలిక వసతులు, తాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ సాయంత్రం జరిగే నదీ హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు, అర్చక సంఘాలు కోరుతున్నాయి.
