KAVITHA JAGRUTHI Phule statue
*పూలే విగ్రహంపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు
*బీసీ ఉపకోటా సాధనే లక్ష్యం.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: కల్వకుంట్ల కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మహత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సామాజిక న్యాయం కోసం పూలే చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు.
*బీసీ ఉపకోటా కోసం ఢిల్లీ స్థాయిలో ఉద్యమం…
మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉప కోటా కల్పించకపోవడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “బీసీ ఉపకోటా లేకపోవడమంటే పాలకులకు ప్రజలంటే భయం లేదన్నమాట. పార్లమెంట్లో మెజారిటీ ఉందని ఇష్టానుసారంగా బిల్లులు పాస్ చేసుకుంటే చూస్తూ ఊరుకోం. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా బిల్లుపై జరగబోయే చర్చలో మా వాణిని బలంగా వినిపిస్తాం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగడతాం. కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమిస్తాం” అని ఆమె హెచ్చరించారు.
*విగ్రహం ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం…
మహత్మా పూలే విగ్రహ ఏర్పాటు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో విగ్రహం కావాలని కోరితే, ట్యాంక్ బండ్ వద్ద పెడతామని చెప్పి ఇప్పుడు ఆ పనులను కూడా అసంపూర్తిగా వదిలేశారని మండిపడ్డారు. అంబేడ్కర్ జయంతి నాటికైనా పూలే విగ్రహాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
*ఆటిజన్ల పోరాటానికి సంపూర్ణ మద్దతు…
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆటిజన్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ చేపట్టిన ఆందోళనలకు జాగృతి పూర్తి మద్దతు ప్రకటించింది. కొత్తగూడెంలో నిరసన తెలుపుతున్న కార్మికులపై చర్యలు తీసుకోవడాన్ని ఆమె ఖండించారు. “గత ప్రభుత్వంలో ఆటిజన్ల వేతనాలు రూ. 40 వేలకు పెరగడంలో జాగృతి కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు వారి హక్కుల కోసం జరిగే పోరాటంలో మా నాయకులు ప్రత్యక్షంగా పాల్గొంటారు” అని స్పష్టం చేశారు.
*పూలే మార్గమే శరణ్యం…
“ఏ విప్లవానికైనా త్యాగమే పునాది. పూలే తన జీవితకాలంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా వెన్నుచూపకుండా పోరాడారు. సమాజంలో మార్పు మన నుంచే మొదలుకావాలి. పూలే ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి. తెలంగాణ జాగృతి బీసీల కోసం పూలే వారసుల్లా పనిచేస్తుంది” అని కవిత పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో జాగృతి ప్రధాన నాయకులు, పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
