Mahabubabad Property Murder Case
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
మహబూబాబాద్ పట్టణంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే ఘోర సంఘటన వెలుగుచూసింది. ఆస్తి వివాదాల కారణంగా కన్నతండ్రినే భార్య, కుమారుడు కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
* ఆస్తి వివాదాల కారణంగా..
మహబూబాబాద్ పట్టణ పరిధిలోని భవానినగర్ తండాకు చెందిన చంద్రయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు కొద్దిరోజులుగా ఆస్తి పంపకాల విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆస్తి గొడవ మళ్లీ తీవ్రరూపం దాల్చింది.
మద్యం మత్తులో ఉన్న కుమారుడు వీరాచారి, తల్లి విజయలక్ష్మితో కలిసి తండ్రి చంద్రయ్యపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన చంద్రయ్య ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
* కుమార్తె సమాచారంతో దర్యాప్తు..
తండ్రి హత్యకు గురైన విషయం తెలుసుకున్న చంద్రయ్య కుమార్తె స్రవంతి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతి రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
* భార్య, కుమారుడిపై కేసు నమోదు..
ప్రాథమిక విచారణలో చంద్రయ్యను ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు వీరాచారి కలసి హత్య చేసినట్లు స్పష్టమైందని టౌన్ సీఐ రఘుపతి రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశామని, నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
