Kavitha on Telangana Employees Issues
* 32 నెలల డీఏ ఏమైంది?..
* రేవంత్ సర్కార్‌పై కవిత విరుచుకుపాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తోందని, పరిపాలనలో భాగస్వాములైన ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన, జాగృతి, వివిధ ఉద్యోగ-ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆత్మీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
* ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే పరిపాలన సులభం
“ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం ఖచ్చితంగా అవసరం. ఉద్యోగులను భాగస్వాములుగా చూడకుండా ఏ స్కీమ్‌నూ సరిగ్గా అమలు చేయలేరు.
నేడు బస్సు డ్రైవర్ నిద్రపోతే బస్సు ప్రయాణం ఎంత ప్రమాదకరంగా మారుతుందో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితిని చూస్తే రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే అనిపిస్తోంది” అని కవిత వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో మహిళలు ఉంటేనే బరకత్ ఉంటుందని, రేపటి రోజున రాబోయే ప్రభుత్వంలో పరిపాలనలో ఆడబిడ్డలకు 50 శాతం భాగస్వామ్యం ఉండేలా చూస్తామని ఆకాంక్షించారు.
*తీవ్ర నిరాశలో విద్యా వ్యవస్థ
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అధ్వానంగా తయారైందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. “తెలంగాణవ్యాప్తంగా 630కి పైగా మండలాలు ఉంటే, కేవలం 8 మండలాల్లో మాత్రమే పర్మనెంట్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా పాఠశాలలన్నీ గాల్లో దీపంలా మారాయి.
ఉపాధ్యాయులపై ఫేషియల్ రికగ్నిషన్, అనవసరమైన రిపోర్టుల పేరుతో తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. టీచర్లు పాఠాలు చెప్పే వాతావరణం లేకుండా చేశారు. జూనియర్ లెక్చరర్లు, ప్రైమరీ స్కూల్ సబ్జెక్ట్ టీచర్ల కొరత తీవ్రంగా ఉంది” అని ఎత్తిచూపారు.
* 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి
కేంద్రం ధరలు పెంచుతుంటే, దానికి అనుగుణంగా ఉద్యోగులకు అందాల్సిన కరువు భత్యాన్ని (డీఏ) ఈ ప్రభుత్వం పూర్తిగా మింగేసిందని విమర్శించారు. గత 32 నెలలుగా డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయని, ఉద్యోగుల ఇండ్లు ఎలా గడవాలని ప్రశ్నించారు. “ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు.
పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు దాటినా పట్టించుకోవడం లేదు. కేకే కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే పీఆర్సీ రిపోర్టు ఆధారంగా 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు.
* పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలి
2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులకు ఓపీఎస్ వర్తింపజేస్తే ప్రభుత్వానికి నెగెటివ్ బర్డెన్ కాకుండా, ఉల్టా రూ. 2000 కోట్ల నిధులు సమకూరే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చే నాథుడే లేడని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టారు.
*సీఎంకు ఓపెన్ ఛాలెంజ్
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను. ఏ ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆసుపత్రికైనా వెళ్దాం.. అక్కడ ఉద్యోగుల హెల్త్ కార్డ్ యాక్సెప్ట్ అయితే మేము దేనికైనా సిద్ధం, లేకపోతే సీఎం రాజీనామా చేస్తారా?” అని సవాల్ విసిరారు.
“ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా (ఆర్టికల్ 309, 310, 311) హక్కులు పొందుతున్నారే తప్ప రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలపై బతకడం లేదు. వారు బానిసలు కాదు. అడిగిన జీతమియ్యని దొరను బతిమలాడాల్సిన అవసరం ఉద్యోగులకు లేదు” అని స్పష్టం చేశారు.
రేపటి రోజున ‘తెలంగాణ రక్షణ సేన’ అధికారంలోకి రావడం ఖాయమని, ఉద్యోగుల హక్కులన్నింటినీ కాపాడుతూ, వారికి పూర్తి గౌరవం ఇచ్చే సుపరిపాలన అందిస్తామని కవిత భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా, పెన్షనర్ల సంఘం నాయకులు మల్లారెడ్డి, ఆర్టీసీ కార్మిక నాయకులు సంజీవ్, మహేందర్ రెడ్డి, కనిష్క, ధరణి, జాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
