* షోకు గుడ్‌బై
ఆకేరు న్యూస్, సినిమా: బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్‌షోలలో ఒకటైన ‘కాఫీ విత్ కరణ్’ ముగింపు దశకు చేరుకుంది. 2004లో ప్రారంభమైన ఈ షో.. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, ఆసక్తికరమైన వెల్లడింపులు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్లు, వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ఇప్పుడు 9వ సీజన్‌తో షోకు ముగింపు పలకనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ భావోద్వేగ సందేశంతో కూడిన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
అసాధారణమైన భాగం
షో చివరి సీజన్‌పై కరణ్ జోహార్ మాట్లాడుతూ.. కొన్ని ప్రయాణాలను ఎప్పుడు ముగించాలో ముందుగానే నిర్ణయించుకోలేమని, అయితే ఒక దశలో వాటిని వీడాల్సిన సమయం వచ్చిందని మనసుకు తెలుస్తుందని అన్నారు. ‘కాఫీ విత్ కరణ్’ తన జీవితంలో ఒక అసాధారణమైన భాగమని, ఈ కార్యక్రమం తనకు స్నేహాలు, జ్ఞాపకాలు, ఎన్నో సరదా క్షణాలు, అభిమానంతో పాటు వివాదాలను కూడా ఇచ్చిందని చెప్పారు. ప్రేక్షకులు షోను నవ్వుతూ, చర్చిస్తూ, ట్రోల్ చేస్తూ, ఆదరిస్తూ మళ్లీ మళ్లీ వీక్షించారని పేర్కొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ చివరిసారిగా తనతో కలిసి ‘కాఫీ’ తాగేందుకు రావాలని కరణ్ కోరారు.
తండ్రితో చెప్పిన మాటలను గుర్తుచేసుకున్న కరణ్
విడుదల చేసిన భావోద్వేగ వీడియోలో కరణ్ 2004 జూన్‌లో తన తండ్రి యష్ జోహార్‌తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. సెలబ్రిటీలను ఇద్దరిని పిలిచి మనస్ఫూర్తిగా మాట్లాడే టాక్‌షో చేయాలని తాను భావిస్తున్నట్లు తండ్రికి చెప్పానని తెలిపారు. దానికి ఆయన తండ్రి.. ‘‘కరణ్, నువ్వు నీ స్నేహితులను పిలిచి, ప్రతిరోజూ చేసే పనినే చేస్తూ మాట్లాడతావు. దానికి నీకు ఎవరు డబ్బులు ఇస్తారు?’’ అని ప్రశ్నించినట్లు కరణ్ గుర్తుచేసుకున్నారు.
‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో పాల్గొనే సెలబ్రిటీల జాబితాపై ఇప్పటికే సోషల్ మీడియాలో, బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్టోబర్ 14న షో ప్రీమియర్ సందర్భంగా ఈ వివరాలపై స్పష్టత రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
