KTR Targets Congress Government
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ భవన్లో జరిగిన వేడుకల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్నో పోరాటాలు, బలిదానాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ.. నేడు కాంగ్రెస్ మార్క్ ‘తుగ్లక్’ పాలనలో నలిగిపోతోందని ఆయన మండిపడ్డారు. పదేళ్లపాటు సుభిక్షంగా ఉన్న పుష్కర తెలంగాణ.. కేవలం ఆరు నెలల్లోనే ముష్కరుల పాలైందని ధ్వజమెత్తారు.
* రైతుబంధు పోయింది.. రాహుల్ బంధు వచ్చింది..
సరిగ్గా పదేళ్ల క్రితం తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలంగాణను సమస్యల వలయం నుంచి విముక్తి కల్పించిన మహోన్నత నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. “ఒకప్పుడు నెత్తురు పారిన నేలలో కేసీఆర్ నీళ్లు పారించారు. కరెంట్ కష్టాలతో అల్లాడిన రాష్ట్రానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించారు.
కానీ నేడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రం మళ్లీ చీకట్లోకి వెళ్లిపోయింది. గత ప్రభుత్వంలో రైతులకు కొండంత అండగా నిలిచిన ‘రైతుబంధు’ పథకాన్ని ఎగ్గొట్టి.. ఇక్కడ ‘రాహుల్ బంధు’ను తీసుకువచ్చారు” అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
* అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “బీఆర్ఎస్ పార్టీ 2014, 2018 ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడి సింగిల్‌గా అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశాం.. కానీ కేవలం చిన్న తేడాతోనే ఓడిపోయాం. కాంగ్రెస్ పార్టీ అడ్డదారుల్లో, తప్పుడు గ్యారెంటీలతో గద్దెనెక్కింది.
కేసీఆర్ పదేళ్లు కష్టపడి తెలంగాణను ‘వడ్డించిన విస్తరి’లా తీర్చిదిద్దితే.. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ‘కుక్కలు చింపిన విస్తరి’గా మార్చేసింది. రాష్ట్ర ప్రగతిని మళ్లీ 25 ఏళ్లు వెనక్కి నెట్టే పరిస్థితి తెచ్చారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* 2028లో మళ్లీ కేసీఆరే సీఎం…
తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై విసిగిపోయారని, మార్పును కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.
“కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి” అనే నినాదంతో ముందుకు సాగుతామని చెప్పారు. రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, కేసీఆర్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
