Tuni Jahnavi Missing Toddler Mystery
ఆకేరు న్యూస్, డెస్క్: తుని మండలం సి.హెచ్. అగ్రహారం గ్రామ సమీపంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి (కొన్ని వివరాల ప్రకారం జ్ఞానేశ్వరి) అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారి మిస్ అయి దాదాపు 72 గంటలు గడుస్తున్నా.. కనీసం ఒక్క క్లూ కూడా లభించకపోవడంతో అటు కుటుంబ సభ్యుల్లో, ఇటు పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ, ఆందోళన నెలకొంది.
* నాన్న దగ్గరుంది అనుకున్నా…
గత 20 ఏళ్లుగా ఓ కొండను ఆనుకుని ఉన్న సుమారు 40 ఎకరాల పామాయిల్, మామిడి తోటను కాపలా కాస్తూ ఈ కుటుంబం అక్కడే నివాసం ఉంటోంది. శనివారం ఉదయం చిన్నారి తండ్రి కరెంట్ పని కోసం తోటలోకి వెళ్లగా.. పాప కూడా ఆయన వెంటే వెళ్ళింది. అయితే, తండ్రి తిరిగి వచ్చేసరికి తల్లి చిన్న పాపకు స్నానం చేయిస్తోంది. “బుజ్జమ్మను చూసుకో, నేను చిన్న పని మీద వెళ్తున్నా” అని భార్యకు చెప్పి ఆయన మళ్లీ వెళ్లారు.
ఈ క్రమంలో పాప ఏడుస్తూ తండ్రి వెనకాలే వెళ్ళింది. ‘పాప నాన్నతోనే ఉంది కదా’ అని తల్లి.. ‘అమ్మ దగ్గరే ఉండి ఉంటుంది’ అని తండ్రి భావించారు. తీరా చూశాక పాప కనిపించకపోవడంతో ఇద్దరూ కలిసి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. తోటలో ఎలాంటి ఓపెన్ బోరుబావులు లేవని, పాప ఎక్కడికీ ఒంటరిగా వెళ్లేంత పెద్దది కాదని తల్లి కన్నీరు మున్నీరవుతోంది.
* మలుపు తిప్పిన పెంపుడు కుక్క ఎంట్రీ..
చిన్నారి మిస్సయిన రోజు ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క (కొక్కబెల్ల).. మూడు రోజుల తర్వాత తీవ్ర గాయాలతో తిరిగి ఇంటికి రావడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కుక్కపై గాయాలు ఉండటంతో అడవిలో క్రూర మృగాలు ఏవైనా దాడి చేశాయా? లేక ఎవరైనా కిడ్నాప్ చేసే క్రమంలో కుక్కపై దాడి చేశారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్క తిరిగి రావడంతో.. పాప కూడా ఈ చుట్టుపక్కల తోటల్లోనే ఎక్కడో ఉండి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
* రంగంలోకి ప్రత్యేక బృందాలు…
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఎంఆర్ఓ (MRO) జీవీఎస్ ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్డిఆర్ఎఫ్ (SDRF), అటవీ శాఖ సిబ్బంది, ప్రత్యేక పోలీస్ బృందాలు డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్లతో ఆ 40 ఎకరాల పామాయిల్ తోటను, పరిసర అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సిసిటివి (CCTV) విజువల్స్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. పాప ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని స్థానికులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.
