Mangalagiri Fake Liquor
* స్కాన్ కాని క్యూఆర్ కోడ్
ఆకేరు న్యూస్, మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో నకిలీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే మద్యం దుకాణంలోనే నకిలీ మద్యం అమ్ముతున్నారనే వార్తలు మందుబాబులను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. స్థానిక లిక్కర్ మార్ట్‌లో కొనుగోలు చేసిన ఒక మద్యం బాటిల్ ప్రభుత్వ అధికారిక యాప్‌లో స్కాన్ కాకపోవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.
*యాప్‌లో రాని వివరాలు
స్థానికుల సమాచారం ప్రకారం.. మంగళగిరి పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఒక లిక్కర్ మార్ట్‌లో ఓ వ్యక్తి బ్లెండర్స్ ప్రైడ్ విస్కీ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. అయితే, బాటిల్ తయారీ, నాణ్యతపై అనుమానం రావడంతో అతడు తన మొబైల్లోని ప్రభుత్వ అధికారిక APSBCL Consumer Portal యాప్ ద్వారా బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు. ఆశ్చర్యకరంగా యాప్‌లో QR Code Not Found / Error అని డిస్ప్లే అయింది. దీంతో అది నకిలీ లేదా కల్తీ మద్యమని బాధితుడు స్పష్టం చేశాడు.
* సోషల్ మీడియాలో వీడియో వైరల్
బాటిల్ స్కాన్ కాకపోవడానికి సంబంధించిన దృశ్యాలను బాధితుడు వీడియోగ్రాఫ్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ప్రభుత్వ షాపులు, లిక్కర్ మార్ట్ ల పేరిట ఇలాంటి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, మద్యం కొనుగోలు చేసేటప్పుడు ప్రతీ ఒక్కరూ యాప్ ద్వారా స్కాన్ చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆ వీడియోలో హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతాల నుంచి నకిలీ రవాణా జరుగుతోందా లేక స్థానికంగానే కల్తీ మద్యం తయారు చేస్తున్నారా అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* విచారణకు డిమాండ్
లిక్కర్ మార్ట్‌లో వెలుగుచూసిన ఈ నకిలీ మద్యం ఉదంతంపై ఎక్సైజ్, సెబ్ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు, మద్యం వినియోగదారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సదరు దుకాణంలోని మొత్తం స్టాక్‌ను తనిఖీ చేసి, కల్తీ మద్యానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే అది నకిలీదా కాదా అనేది అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
