Kaleshwaram Project Kadiyam Srihari
* ఎన్డిఎస్ఏ సూచనలు మాత్రమే ప్రభుత్వం పాటిస్తుంది
* హరీష్ రావు దిగజారుడు మాటలు
* కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు ?
-ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
మేడిగడ్డ పనిచేయకపోతే కాలేశ్వరం ప్రాజెక్టు పనిచేయదని, ఎన్ డి ఎస్ ఏ సూచనలు రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని అవగాహన రాయిత్యంతో అధికారం కోసం మాజీ మంత్రి హరీష్ రావు దిగజారుడు మాటలు సరికాదని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నీనో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దేశంలో ఏ నదిలో కూడా ఆశించిన నీటి ప్రవాహం లేదని తెలిపారు. కరువు పరిస్థితుల దృశ్య రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిందని మాట్లాడుతున్నారని ఒక బాధ్యతయుతమైన వ్యక్తి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సరైంది కాదని అన్నారు. బిఆర్ఎస్ మెడిగడ్డ కుంగిపోతే కన్నెపల్లి నుండి నీటిని ఎత్తిపోయచ్చు కదా అంటున్నారు.
ప్రస్తుతం గోదావరిలో 16 వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉందని, 16 వేల క్యూసెక్కుల ప్రవాహంతో నీటి ఎత్తిపోయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నీటిని ఎత్తిపోయాలి అంటే కనీసం 2 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండలాని నీటి పారుదల నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు. ఒకవేళ కన్నెపల్లి నుండి నీటిని లిఫ్ట్ చేసినా మళ్ళీ అన్నారం అక్కడి నుండి సుందిళ్లకు లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నారం, సుందిళ్లలలో నీటిని నిల్వ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిందేనని వెల్లడించారు.
మీరు నీటిని లిఫ్ట్ చేయండి ఎం జరిగినా బాధ్యత మేము తీసుకుంటాం అని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారని కానీ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగి పోవడానికి ఎవరూ బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు.
జరిగిన దానికి బాధ్యత వహించకుండా జరగబోయేదానికి బాధ్యత వహిస్తాం అనడం సిగ్గుచేటని విమర్శించారు. కుంగిన కాళేశ్వరానికి బాధ్యత మాదేనని కేసీఆర్, హరీష్ రావు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. పైగా పాదయాత్రలు చేస్తామంటున్న నాయకులు ఏ మొహం పెట్టుకొని పాదయాత్రలు చేస్తారని విమర్శించారు. 10ఏళ్ళు అధికారంలో ఉండి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేంటేనే 70 వేల ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు అందించిందని తెలిపారు. నోటిఫికేషన్లు ఇచ్చి వదిలేదిన వాళ్ళు, గ్రూప్ -1 పరీక్ష నిర్వహించలేని వాళ్ళు, గ్రూప్ -1పేపర్ లీకేజికి పాల్పడిన వాళ్ళు ఈ రోజు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నోటిఫికెషన్లు ఇచ్చి వదిలేసింది ఎవరో… నియామకాలు పూర్తి చేస్తుంది ఎవరో యువత ఆలోచించాలని కోరారు. 10 ఏళ్ల అధికారంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుందని ఆరోపించారు. 2014 ముందు మీ ఆస్తులు ఎంత ? ఇప్పుడు ఎంత ఉందని ప్రశ్నించారు.
వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, ఫామ్ హౌస్ లు ఎక్కడినుండి వచ్చాయని ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విడ్ ప్రొకో ద్వారా వచ్చినవే అని వాటిని ఉద్యమకారులకు పంచాలని స్వయంగా కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తన్నారని ఈ ప్రశ్నకు సమాధానం వివరిస్తారని కడియం ప్రశ్నించారు. హరీష్ రావు నీటి పారుదల మంత్రిగా విపరీతమైన అవినీతికి పాల్పడ్డడని ఇప్పుడు మళ్ళీ దోచుకోవడానికే ప్రాజెక్టులు అడుగుతున్నాడని కవిత ఆరోపించడాన్ని ఆయన గుర్తు చేశారు.
హరీష్ రావు, బిఆర్ఎస్ నాయకులు ముందుగా కవిత మాటలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయామనే అక్కసుతో సభ్యత, సంస్కారం మరచి మాట్లాడుతున్నారని, కొన్ని పత్రికలు, యుట్యూబ్ చానళ్ళు పెట్టుకొని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ రైతులను, ప్రజలను, యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను దేవాదుల ద్వారా నింపే ప్రయత్నం చేస్తున్నానని వారం రోజుల్లో రైతులకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. యువత, రైతులు, ప్రజలు బిఆర్ఎస్ చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబాటి కిషన్ రాజ్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపాలిటీ పరిధిలోని బూత్ లెవల్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
