MLA Padi Kaushik Reddy inspects Double Bedroom Houses
* అధికార పక్షానికి పట్టని ప్రజల కష్టాలు
* పరస్పర ఆరోపణలతో కాలయాపన
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కమలాపూర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి విలేకరులతో మాట్లాడారు ..
మండల కేంద్రంలో గత సీఎం కేసీఆర్ హయాంలో ఒక్కో ఫ్లాట్‌కు రూ.5.04 లక్షలు చొప్పున రూ.20 కోట్ల వ్యయంతో 394 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అలాగే మౌలిక వసతుల కోసం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల చొప్పున మొత్తం రూ.4.92 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని ఆయన గుర్తుచేశారు.
* మంత్రుల హామీలు – జాబితాలో జాప్యం
ఇటీవల కమలాపూర్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రకటించి ప్రొసీడింగ్స్ ఇస్తామన్న మంత్రులు, పది రోజులు గడిచినా పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గృహ సముదాయాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస వసతులు ఇంకా పూర్తి కాలేదని, అనేక ఇళ్లలో తలుపులు, కిటికీలు, బాత్రూమ్లు పాడైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టిందని కౌశిక్ రెడ్డి అన్నారు. నాయకులు పరస్పర ఆరోపణలు, విమర్శలతో కాలం గడుపుతున్నారే తప్ప, పేద ప్రజల కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అర్హులైన నిజమైన పేదలకు తక్షణమే ఇళ్లను కేటాయించి, కనీస వసతులు కల్పించాలని, లేనిపక్షంలో లబ్ధిదారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండ శ్రీనివాస్, పోల్నేని సత్యనారాయణరావు, కమలాపూర్ మండల సీనియర్ నాయకులు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, తక్కలపల్లి సత్యనారాయణరావు, ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు నవీన్, లక్ష్మణ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేష్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
